Rabies After Vaccination: కుక్క లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు వెంటనే రేబీస్ వ్యాక్సిన్ వేసుకోవడం అత్యంత ముఖ్యం. అయితే, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా కొందరికి రేబీస్ రావడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం. "వ్యాక్సిన్ తీసుకున్నా రేబీస్ ఎందుకు వస్తుంది?" అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిపుణుల సమాచారం ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి దాపురిస్తుందని తెలుస్తోంది.

వ్యాక్సిన్ తీసుకున్నా రేబీస్ రావడానికి ప్రధాన కారణాలు

వ్యాక్సిన్ డోసులు సకాలంలో వేసుకోకపోవడం

రేబీస్ వ్యాక్సిన్‌ను డాక్టర్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం.. క్రమం తప్పకుండా తీసుకోవాలి. మొదటి డోస్ వేసుకుని మిగిలిన డోసులను నిర్లక్ష్యం చేసినా లేదా ఆలస్యంగా వేసుకున్నా శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తగినంతగా ఉత్పత్తి కావు.

తీవ్రమైన గాయాలకు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన తీసుకోకపోవడం:

కుక్క కరిచిన గాయం చాలా పెద్దదిగా ఉన్నా, రక్తం ఎక్కువగా వచ్చినా లేదా గొంతు, ముఖం, చేతి వేళ్లపై కరిచినా కేవలం వ్యాక్సిన్ మాత్రమే సరిపోదు. వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీలను తయారు చేయడానికి సమయం పడుతుంది. ఈ లోపు వైరస్ మెదడుకు చేరకుండా నిరోధించడానికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనే రెడీమేడ్ యాంటీబాడీ ఇంజెక్షన్‌ను గాయం చుట్టూ వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని తీసుకోకపోతే ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.

గాయాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం:

జంతువు కరిచిన వెంటనే ఆ ప్రదేశాన్ని ప్రవహించే నీరు మరియు సబ్బుతో కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. వ్యాధి బారిన పడకుండా ఉండటంలో ఈ ప్రక్రియ 50% పైగా రక్షణనిస్తుంది. గాయాన్ని సరిగ్గా కడగకుండా ఉంటే వైరస్ నాడీ వ్యవస్థలోకి సులభంగా ప్రవేశిస్తుంది.

నాటు వైద్యం లేదా గాయంపై పసుపు, కారం పూయడం:

కరిచిన గాయంపై పసుపు, కారం, సున్నం లేదా ఇతర పదార్థాలు రాయడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమవుతుంది. ఇది వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయడానికి ఆటంకం కలిగిస్తుంది.

వ్యాక్సిన్ నిల్వ సామర్థ్యం తగ్గడం

వ్యాక్సిన్‌ను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోయినా లేదా నాణ్యతా లోపాలు ఉన్నా దాని ప్రభావం తగ్గిపోవచ్చు.

జంతువులు కరిచినప్పుడు తక్షణమే చేయాల్సిన పనులు

కరిచిన ప్రాంతాన్ని వెంటనే కనీసం 15 నిమిషాల పాటు సబ్బు, నీటితో బాగా రుద్ది కడగాలి.

గాయంపై ఎటువంటి పదార్థాలు పూయకుండా పొడి గుడ్డతో తూడ్చి, వెంటనే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలి.

వైద్యుల సలహా మేరకు వ్యాక్సిన్, అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తక్షణమే తీసుకోవాలి.

వైద్యులు సూచించిన అన్ని డోసులను నిర్దేశించిన తేదీల్లోనే ఖచ్చితంగా వేయించుకోవాలి.

Tags: