Heart Attack Risk: నిద్రపోయే టైమ్ మారుతోందా? గుండెపోటు ముప్పు రెట్టింపు! జాగ్రత్త!
గుండెపోటు ముప్పు రెట్టింపు! జాగ్రత్త!
Heart Attack Risk: మీరు రోజుకు 7 నుండి 8 గంటలు నిద్రపోతున్నారా? చాలా మంచిది. అయితే, ఆ నిద్ర ఎప్పుడు పోతున్నారు? అర్ధరాత్రి ఒక గంటకా.. లేక తెల్లవారుజామున రెండు గంటలకా? మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారనే దానికంటే.. ఏ సమయానికి పడుకుంటున్నారనేది మీ గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. నిద్ర విషయంలో సరైన సమయపాలన లేకపోతే.. గుండెపోటు ముప్పు ఏకంగా రెట్టింపు అవుతుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
మనం పడుకునే సమయంలో కేవలం ఒకటి లేదా రెండు గంటల తేడా వచ్చినా, మన శరీరంలోని జీవ గడియారం (Circadian Rhythm) పూర్తిగా దెబ్బతింటుంది. ఈ జీవ గడియారం అస్తవ్యస్తమైతే.. రక్తపోటు పెరగడం, జీవక్రియలు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది నేరుగా మీ గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంటే, వీకెండ్స్‌లో ఆలస్యంగా పడుకోవడం లేదా రోజుకో సమయంలో నిద్రపోవడం అనేది మీ గుండెకు మీరు చేస్తున్న ద్రోహం లాంటిదే!
గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే.. కేవలం ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు, నిద్రలో క్రమశిక్షణ కూడా అవసరం. మీ గుండె పదిలంగా ఉండాలంటే వైద్యులు చెబుతున్న చిట్కా ఒక్కటే: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం. రాత్రి 10 గంటలకల్లా పడకపైకి వెళ్లడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, గుండె కండరాలకు తగినంత విశ్రాంతిని ఇస్తుంది.
గుర్తుంచుకోండి నిద్ర అనేది ఒక విలాసం కాదు అది మీ ప్రాణానికి అవసరమైన ఇంధనం. నిద్ర సమయాన్ని మార్చకండి.. మీ ఆయుష్షును తగ్గించుకోకండి. సరైన సమయానికి నిద్రపోండి!