Diabetes: మధుమేహం.. హైదరాబాద్ యువతకు సైలెంట్ కిల్లర్ - నేడు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
నేడు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం
Diabetes: మారుతున్న జీవన శైలిలో భాగంగా ప్రస్తుతం ప్రతిఒక్కరిని మధుమేహం (షుగర్) ముప్పు కలవరపెడుతోంది. డయాబెటిస్ వల్ల ప్రాణానికి హాని కాకపోయినా జీవన విధానానికి ఆటంకం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేగంగా మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు అనేక కారణాలు మధుమేహం రావడానికి దోహదపడుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల నగర జీవనశైలిలో మధుమేహం విస్తరిస్తోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు యువతను వేధిస్తోంది.
దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక మంది మధుమేహంతోనే బాధపడుతున్న వారు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అనుమానంతో వచ్చే బాధితుల్లో నలుగురిలో ఒకరికి తప్పనిసరిగా మధుమేహం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘ఎర్లీ యాక్షన్ ఆన్ డయాబెటిస్’ (మధుమేహంపై ముందస్తు చర్యలు) అనే అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన వైద్యసేవలు అందించడం, సమస్యలపై అవగాహన పెంచడం ముఖ్యమని నిపుణులు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్పత్రులకు వచ్చే వారిలో 25 శాతం మించి మధుమేహ రోగులున్నట్లు వైద్యుల అంచనా వేస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీ నిర్వహించిన సర్వేల్లో కూడా యువతలో ఎక్కువగా మధుమేహం ఉన్నట్లు తేలింది. 1,900 మందికి నిర్వహించిన ఈ సర్వేలో యువత 25 శాతానికి మించి ఈ రుగ్మతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 43 శాతం మంది మధుమేహగ్రస్తులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తొమ్మిది శాతం మందికి తమకు జబ్బు ఉన్న విషయమే తెలియదు. 13 నుంచి 19 మధ్య వయస్సు గల వారిలో 20 శాతం, 20-30 ఏళ్ల వారిలో 30 శాతం, 30-40 ఏళ్ల వారిలో 40 శాతం, 40 కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 50 శాతం కంటే మించి మధుమేహంతో బాధపడుతున్నారు.
19 ఏళ్లలోపు వయస్సున్న సుమారు 2.3 లక్షల నుంచి 2.8 లక్షల మంది టైప్-1 డయాబెటిస్తో బాధపడుతుండగా, తెలంగాణలోనూ సుమారు 10 వేల నుంచి 15 వేల మందికిపైగా చిన్నారులు, యువత ఈ వ్యాధితో జీవిస్తున్నట్లు అంచనా. చెప్పు కాటు, బొబ్బలు, పాదాల పగుళ్లు, చిన్న కోతలతోనే సమస్య మొదలవుతుంది. నరాల దెబ్బతినడం వల్ల నొప్పి తెలియక చాలామంది పట్టించుకోరు. ప్రారంభంలోనే గాయాన్ని పరీక్షించి, ఇన్ఫెక్షన్ను నియంత్రించడం, సరైన డ్రెస్సింగ్ చేయడం ముఖ్యం. ప్రతి మధుమేహ బాధితుడు రోజూ పాదాలను పరిశీలించుకోవాలి. చెప్పులు లేకుండా నడవకూడదు.
మధుమేహాన్ని సకాలంలో గుర్తించి నియంత్రించకపోతే గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం, కంటి చూపు దెబ్బతినడం, నరాల సమస్యలు, పాదాలకు పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులపైనా శ్రద్ధ వహించాలి. నిత్యం నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర పదార్థాలు, శీతల పానీయాలు, అధిక కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నిద్రపోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.