Link Between Body Temperature and Autoimmune Diseases: మగవారి కన్నా ఆడవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు మరింత బలంగా ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్ల బారినపడే ముప్పు తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఒక తిరకాసుంది. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి, ఆరోగ్య కణజాలం మీద దాడి చేయటం (ఆటోఇమ్యూన్) వల్ల తలెత్తే ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. ఇవి ఆడవారిలో నాలుగు రెట్లు ఎక్కువ.

ఇందుకు లింగాన్ని నిర్ధారించే జన్యువుల దగ్గరి నుంచి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుండగా.. ఆడవారిలో రెండు జతల ఎక్స్ క్రోమోజోములంటాయి. ఎక్స్ క్రోమోజోమ్‌లు చాలా రోగనిరోధక జన్యువులనూ మోస్తుంటాయి. అంటే ఆడవారిలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనకు తోడ్పడే జన్యు వైవిధ్యం ఉంటుందన్నమాట.

మరోవైపు హార్మోన్ల మార్పులూ ప్రభావం చూపుతుంటాయి. సంతానాన్ని కనే వయసులో ఈస్ట్రోజన్ హార్మోన్ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంటుంది. అయితే రుతుక్రమం ఆగటం మొదలైన దశలో, ఆగిన తర్వాత దీని మోతాదులు తగ్గుతాయి. ఇది ఒంట్లో కణస్థాయిలో వాపు ప్రక్రియను ఉత్తేజితం చేసే అవకాశముంది. ఫలితంగా ఆటోఇమ్యూన్ జబ్బుల ముప్పు పెరుగుతుంది.ఇందులో శరీర ఉష్ణోగ్రతలూ పాలు పంచుకుంటున్నట్టు పారిస్‌లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత రోగనిరోధక ప్రతిస్పందనలనూ ప్రభావితం చేస్తుంది. ఆడవారిలో తరచూ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు తలెత్తటం రోగనిరోధక కణాల పనితీరునూ మారుస్తుంది. హాని కారకాలను, ఆరోగ్య కణజాలాన్ని వేరు చేసి, గుర్తించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఇవి అతిగా స్పందించటం ఆటోఇమ్యూన్ జబ్బుల ముప్పు పెరగటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే నెలసరి, శరీర ఉష్ణోగ్రత, రోగనిరోధక కణాల ప్రతిస్పందన మధ్య సంబంధాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతలో చిన్న మార్పులు కూడా రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయగలవు. మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఉష్ణోగ్రత మార్పులు కలిసి ఆటోఇమ్యూన్ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.

ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి వ్యాధులు మహిళల్లో ఎక్కువగా కనిపించడానికి జన్యు, హార్మోన్, ఉష్ణోగ్రత అంశాలు కలిసి పని చేస్తాయి. ఈ పరిశోధన భవిష్యత్తులో మహిళల ఆరోగ్య సంరక్షణలో కొత్త దిశలను చూపించగలదు. శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడం, జీవనశైలి మార్పులు ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. వైద్యులు ఈ కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: