Snake Venom Antidote: పాము కాటుకు విరుగుడు ఎలా తయారు చేస్తారో తెలుసా..?
విరుగుడు ఎలా తయారు చేస్తారో తెలుసా..?;
Snake Venom Antidote: పాముకాటుకు యాంటీవీనమ్ అనేది ప్రాణాలను కాపాడే ఒక ముఖ్యమైన చికిత్స. ఇది చాలా సంక్లిష్టమైన, శాస్త్రీయ నైపుణ్యం, కఠినమైన నియంత్రణలు అవసరమయ్యే ప్రక్రియ ద్వారా తయారు చేయబడుతుంది. సాధారణ ప్రజలు ఇంట్లో దీన్ని చేయడం సాధ్యం కాదు. దీన్ని తయారీకి ప్రత్యేక ప్రయోగశాలలు, నిపుణుల పర్యవేక్షణ దీనికి అవసరం.
విషపూరిత పాముల నుండి విషాన్ని జాగ్రత్తగా సేకరించడం అనేది యాంటీవీనమ్ తయారీలో కీలకమైన దశ. ఈ విషాన్ని తరువాత పలుచన చేసి, చాలా తక్కువ మోతాదులో గుర్రాలు వంటి జంతువుల శరీరాల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ జంతువులు చాలా బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం వలన, వాటి శరీరాలు విషానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విరుగుడు మందులు విషాన్ని తటస్థీకరించడంలో సహాయపడతాయి.
గుర్రం శరీరం తగినంత యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని నిర్ధారించుకున్న తర్వాత, వాటి రక్తం నుండి ప్లాస్మాను సంగ్రహిస్తారు. ఈ ప్లాస్మా నుండే విషానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరోధకాలను వేరు చేస్తారు. ఈ శుద్ధి చేయబడిన ప్రతిరోధకాలు యాంటీవీనమ్‌గా మారుతాయి. ఈ శుద్దీకరణ ప్రక్రియ అలెర్జీల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, రోగులు దీనిని సురక్షితంగా ఉపయోగించవచ్చు.
ప్రతి పాముకి ఒక మందు
ప్రతి రకమైన పాము విషానికి సాధారణంగా ఒక నిర్దిష్ట రకం యాంటీవీనమ్ అవసరం. అందువల్ల, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే పాముకాటును ఎదుర్కోవడానికి, ఆ ప్రాంతంలోని పాముల విషంతో తయారు చేసిన యాంటీవీనమ్‌ను ఉపయోగించడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. విష నిరోధక మందు ఉత్పత్తిలో ఉపయోగించే జంతువుల రక్షణకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా యాంటీవీనమ్ కొరత కారణంగా.. వాటి అభివృద్ధికి ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. పాము కాటుకు గురైనప్పుడు, ప్రాణాలను కాపాడటానికి వీలైనంత త్వరగా చికిత్స, సరైన యాంటీవీనమ్ అందించడం చాలా అవసరం.