Early Symptoms of Typhoid: సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకండి.. టైఫాయిడ్ ప్రారంభ లక్షణాలు ఇవే..
టైఫాయిడ్ ప్రారంభ లక్షణాలు ఇవే..
Early Symptoms of Typhoid: సాధారణంగా వాతావరణంలో మార్పులు వచ్చినా లేదా వర్షాకాలంలోనూ జ్వరం రావడం సహజం. అయితే, ప్రతీ జ్వరాన్ని సాధారణ వైరల్ ఫీవర్‌గా భావించి ఉపేక్షిస్తే తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల టైఫాయిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
టైఫాయిడ్ ఎలా వ్యాపిస్తుంది?
టైఫాయిడ్ అనేది ఒక ప్రమాదకరమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.
కలుషిత నీరు, ఆహారం:
పరిశుభ్రత లేని నీరు, ఈగలు వాలిన ఆహారం మరియు కలుషితమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
వ్యక్తిగత పరిశుభ్రత లోపం:
ఆహారం తీసుకునే ముందు, శౌచాలయాలను ఉపయోగించిన తర్వాత చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి లేదా ఆహార పదార్థాలకు సులభంగా వ్యాపిస్తుంది.
ప్రారంభంలో కనిపించే ముఖ్య లక్షణాలు
ఇన్ఫెక్షన్ సోకిన కొన్ని రోజుల నుండి రెండు వారాల వ్యవధిలో ఈ క్రింది లక్షణాలు బయటపడతాయి..
నిరంతర జ్వరం: క్రమంగా పెరుగుతూ ఉండే తీవ్రమైన జ్వరం.
శరీర నొప్పులు - అలసట: విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు మరియు తీవ్ర బలహీనత.
జీర్ణవ్యవస్థ సమస్యలు:
ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, కడుపునొప్పి.
మలబద్ధకం లేదా విరేచనాలు:
కొందరిలో తీవ్రమైన మలబద్ధకం కనిపిస్తే, మరికొందరిలో విరేచనాలు రావచ్చు.
సాధారణ వైరల్ ఫీవర్ అనుకుని సొంత వైద్యం చేసుకోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందే తప్ప ఉపశమనం లభించదు.
సమయానికి చికిత్స తీసుకోకపోతే ఏమవుతుంది?
టైఫాయిడ్‌ను ఆరంభంలోనే గుర్తించి యాంటీబయోటిక్స్ ద్వారా చికిత్స అందిస్తే త్వరగా కోలుకోవచ్చు. ఒకవేళ అలసత్వం వహిస్తే..
కడుపు, ప్రేగులలో పూత లేదా రంధ్రాలు పడే ప్రమాదం ఉంది.
కాలేయం, ప్లీహం వాపునకు గురవుతాయి.
శరీరంలో తీవ్రమైన నీటిశాతం తగ్గడం సుదీర్ఘకాలం నీరసం వేధించడం జరుగుతుంది.
ముందస్తు జాగ్రత్తలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కాచి చల్లార్చిన నీరు:
ఎల్లప్పుడూ బాగా కాచి, చల్లార్చిన నీటిని లేదా ఫిల్టర్ చేసిన శుభ్రమైన నీటిని మాత్రమే తాగావాలి.
తాజా ఆహారం:
వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. రోడ్డుపక్కన బహిరంగంగా అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
చేతుల పరిశుభ్రత:
భోజనానికి ముందు, బయటకు వెళ్లి వచ్చాక చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.
పండ్లు, కూరగాయలు:
పండ్లు, కూరగాయలను తినేముందు ఉప్పు నీటితో లేదా శుభ్రమైన నీటితో బాగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి