Drinking ORS Water All Day Long: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేసవి వేడి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చాలామంది ఓఆర్ఎస్ లవణాల నీటిని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది ఐతే ఏకంగా వాటర్ బాటిళ్లలో ఓఆర్ఎస్ కలిపేసుకుని రోజంతా దాన్నే తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఇలా పదే పదే ఓఆర్ఎస్ నీటిని తాగడం అందరికీ సురక్షితమేనా? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన సీనియర్ డాక్టర్ దీపక్ సుమన్ తెలిపిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఓఆర్ఎస్ ఎప్పుడు అవసరం?

ఓఆర్ఎస్‌లో సోడియం, పొటాషియం మరియు గ్లూకోజ్ వంటి ముఖ్యమైన లవణాలు ఉంటాయి. ఇవి శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు త్వరగా కోలుకోవడానికి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి అద్భుతంగా సహాయపడతాయి.

ఎవరికి ఉపయోగం:

ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారు, పొలం పనులు చేసే కూలీలు, ఎండదెబ్బ తగిలిన వృద్ధులు, పిల్లలు, నీళ్ల విరేచనాలు, వాంతుల సమస్యతో బాధపడేవారికి ఓఆర్ఎస్ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

మితిమీరి తాగితే పొంచి ఉన్న ముప్పులు..

ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని అవసరానికి మించి అమితంగా తాగడం వల్ల శరీరానికి తీవ్ర హాని జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం: శరీరంలో లవణాల శాతం మితిమీరితే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పి, అది నేరుగా మూత్రపిండాల (కిడ్నీల) పనితీరుపై దెబ్బకొడుతుంది.

షుగర్ లెవెల్స్ పెరగడం:

ఓఆర్ఎస్‌లో గ్లూకోజ్ (చక్కెర) ఉంటుంది. కాబట్టి రోజంతా దీన్నే తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.

రక్తపోటు పెరగడం:

దీనిలో ఉండే అధిక ఉప్పు కారణంగా బీపీ లెవెల్స్ పెరిగిపోతాయి.

వీరంతా ఓఆర్ఎస్‌కు దూరంగా ఉండాలి..

సాధారణంగా ఇంట్లోనే ఉంటూ, పుష్కలంగా మంచి నీరు తాగుతూ, ఎలాంటి డీహైడ్రేషన్ లక్షణాలు లేని వారికి తరచుగా ఓఆర్ఎస్ తాగాల్సిన అవసరం అస్సలు లేదు. ముఖ్యంగా క్రింది సమస్యలు ఉన్నవారు దీనికి వీలైనంత దూరంగా ఉండాలి..

అధిక రక్తపోటు ఉన్న రోగులు

డయాబెటిస్ ఉన్నవారు

గుండె జబ్బులు, మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులు ఉన్నవారు

వేసవిలో సురక్షితమైన ప్రత్యామ్నాయాలు..

తీవ్రమైన ఎండల నుండి శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి ఓఆర్ఎస్ మాత్రమే మార్గం కాదు. నిత్యం ఇంట్లో లభించే క్రింది పానీయాలు తీసుకోవడం ఎంతో ఆరోగ్యకరం..

మజ్జిగ : చలవ చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కొబ్బరి నీరు: ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్ పానీయం.

తాజా పండ్ల రసాలు తగినంత మంచి నీరు.

Tags: