Eating Fruit Salad: ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది పండ్ల సలాడ్లు, మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్‌లను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటారు. పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయన్నది ఎంత నిజమో.. సరైన అవగాహన లేకుండా ఏ పండ్లను పడితే ఆ పండ్లతో కలిపి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందన్నదీ అంతే వాస్తవం. ఆయుర్వేదం మరియు ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం కొన్ని పండ్ల కలయిక విషతుల్యంగా మారి కడుపునొప్పి, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపి తినకూడని పండ్ల కాంబినేషన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలిపి తీసుకోకూడని పండ్ల కలయికలు ఇవే..

ఆమ్ల పండ్లు - తీపి పండ్లు

నారింజ, నిమ్మ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి పుల్లటి పండ్లను.. అరటిపండు, ఎండుద్రాక్ష లేదా ఖర్జూరం వంటి తీపి పండ్లతో కలిపి ఎప్పుడూ తినకూడదు.

కారణం:

పుల్లటి పండ్లలో ఉండే ఆమ్లాలు, తీపి పండ్లలోని సహజ చక్కెరలు జీర్ణం కావడానికి వేర్వేరు సమయాలు, ఎంజైమ్‌లు అవసరమవుతాయి. వీటిని కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

పుచ్చకాయ - కర్బూజాతో ఇతర పండ్లు

పుచ్చకాయను ఎల్లప్పుడూ ఒంటరిగానే తినాలి. పుచ్చకాయలలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది.

కారణం:

నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు అతి త్వరగా జీర్ణమవుతాయి. ఇతర పండ్లతో వీటిని కలిపి తిన్నప్పుడు, ఇతర పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతూ పుచ్చకాయను కూడా ప్రేగులలో నిలిచిపోయేలా చేస్తాయి. దీనివల్ల పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం, పులితేన్పులు రావడం జరుగుతుంది. అందుకే "వాటర్‌మెలన్‌ను ఒంటరిగానే తినాలి లేదా వదిలేయాలి" అని నిపుణులు చెబుతుంటారు.

అరటిపండు - జామపండు

చాలామంది ఫ్రూట్ సలాడ్లలో ఈ రెండింటినీ కలిపి తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

కారణం:

ఈ రెండు పండ్ల కలయిక శరీరంలో విషతుల్యమైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన ఎసిడిటీ, వికారం, కడుపునొప్పి, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది.

అధిక పిండిపదార్థం ఉన్న పండ్లు - అధిక ప్రొటీన్ పండ్లు

స్టార్చ్ ఎక్కువగా ఉండే ఆహారాలు పండ్లు, అధిక ప్రొటీన్ ఉండే పండ్లు కలిపి తీసుకోకూడదు.

కారణం:

ప్రొటీన్‌ను జీర్ణం చేయడానికి ఆమ్ల వాతావరణం అవసరం కాగా, స్టార్చ్‌ను జీర్ణం చేయడానికి క్షార వాతావరణం అవసరం. ఇవి రెండూ కలిసినప్పుడు జీర్ణ ఎంజైమ్‌లు ఒకదానితో ఒకటి తలపడి జీర్ణ ప్రక్రియను స్తంభింపజేస్తాయి.

పండ్లు తినేటప్పుడు పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు

ఖాళీ కడుపున లేదా భోజనానికి ముందు:

పండ్లను ఎల్లప్పుడూ భోజనానికి అరగంట ముందు లేదా ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం అత్యంత శ్రేయస్కరం.

భోజనం తర్వాత వెంటనే పండ్లు వద్దు:

భోజనం చేసిన వెంటనే పండ్లు తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బరంగా మారుతుంది.

ఒకే రకానికి ప్రాధాన్యత:

వీలైనంత వరకు ఒక సమయంలో ఒకే రకమైన పండును తినడం వల్ల శరీరం అందులోని పోషకాలను పూర్తిగా గ్రహించగలుగుతుంది. సరైన పద్ధతిలో సరైన కలయికతో పండ్లను తీసుకున్నప్పుడే అవి అమృతంలా పనిచేసి పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Tags: