Lack of Sleep: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిద్రకు సరైన సమయం కేటాయించడం లేదు. ఉద్యోగ ఒత్తిడి, మొబైల్ ఫోన్ల వాడకం, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వంటి కారణాలతో నిద్ర వేళలు మారిపోతున్నాయి. అయితే, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సరిపడా నిద్ర ఎంతో అవసరం. నిద్రను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసును బట్టి మనిషికి అవసరమైన నిద్ర సమయం మారుతుంది. సాధారణంగా 18 నుంచి 60 ఏళ్ల వయసున్న పెద్దలు రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నిద్ర సమయంతో పాటు నిద్ర నాణ్యత కూడా ముఖ్యమే. రాత్రిపూట పదేపదే మెలకువ రావడం, సరిగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

ఎక్కువ కాలం సరిపడా నిద్ర లేకపోతే శరీరంపై ప్రభావం పడుతుంది. అలసట, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తిపై ప్రభావం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే, దీర్ఘకాలిక నిద్రలేమికి ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు మొబైల్ ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి. నిద్రపోయే గదిని ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. పగటిపూట శారీరకంగా చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మంచి నిద్రకు తోడ్పడతాయి. అయితే, నిద్రపోయే సమయానికి దగ్గరగా తీవ్రమైన వ్యాయామం చేయకుండా ఉండటం మంచిది. రాత్రిపూట ఎక్కువగా భోజనం చేయడం, నిద్రకు ముందు కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకోవడం తగ్గించాలి.

కొంతమందికి పడుకున్నా నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట తరచూ మెలకువ రావడం, ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఉండవచ్చు. ఈ సమస్యలు తరచూ ఎదురవుతూ రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అవసరమైతే నిద్రకు సంబంధించిన సమస్యల కోసం వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో సరిపడా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా రోజువారీ పనులను ఉత్సాహంగా చేసుకోవచ్చు. అందుకే బిజీ జీవితంలోనూ నిద్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags: