Eating on a Banana Leaf: అరటి ఆకులో భోజనం: దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?

దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?

Update: 2026-01-22 13:21 GMT

Eating on a Banana Leaf: శుభకార్యం ఏదైనా, విందు భోజనం అరటి ఆకులో వడ్డిస్తే ఆ మజానే వేరు. అరటి ఆకులో వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వడ్డించినప్పుడు వచ్చే ఆ సువాసన ఆకలిని రెట్టింపు చేస్తుంది. అయితే, అరటి ఆకు కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, మన శరీరానికి కూడా ఒక వరప్రసాదం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పోషకాల గని: పాలీఫెనాల్స్

అరటి ఆకులలో పాలీఫెనాల్స్ అనే సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్రీన్ టీలో కూడా కనిపిస్తాయి. వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు, ఈ పాలీఫెనాల్స్ ఆహారంలోకి విడుదలవుతాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి.

సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్ రక్షణ

అరటి ఆకు ఉపరితలంపై హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేసే గుణాలు ఉంటాయి. ఇది ఆహారాన్ని కలుషితం కాకుండా చూస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బయటి పొరపై ఉండే సహజ మైనపు లాంటి పదార్థం వేడి తగలగానే కరిగి, జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపును శుభ్రంగా ఉంచుతుంది.

కెమికల్ ఫ్రీ భోజనం

మనం వాడే ప్లాస్టిక్ ప్లేట్లు లేదా సింథటిక్ డిస్పోజబుల్ ప్లేట్లలో BPA, థాలేట్‌ల వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. వేడి పదార్థాలు వడ్డించినప్పుడు ఇవి ఆహారంలో కలిసి శరీరంలోకి విషపూరిత మూలకాలను పంపిస్తాయి. అరటి ఆకు పూర్తిగా రసాయన రహితం. ఇది వాడి పారేసినా పర్యావరణంలో సులభంగా కలిసిపోతుంది, తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

పెరిగే రోగనిరోధక శక్తిఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అన్నింటికంటే మించి, అరటి ఆకుపై భోజనం చేయడం వల్ల కలిగే మానసిక తృప్తి, ఆ ఆహ్లాదకరమైన వాసన జీర్ణ ప్రక్రియను సాఫీగా సాగేలా చేస్తాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మన పూర్వీకులు అందించిన ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని మనం మళ్లీ అలవాటు చేసుకోవాలి. వారానికి కనీసం ఒక్కసారైనా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల అటు ఆరోగ్యం, ఇటు పర్యావరణం రెండూ భద్రంగా ఉంటాయి.

Tags:    

Similar News