Cigarette: ఒక్క సిగరెట్ అయినా సరే.. మీ గుండె, ఊపిరితిత్తులను ఎంతలా డ్యామేజ్ చేస్తుందో తెలుసా?
మీ గుండె, ఊపిరితిత్తులను ఎంతలా డ్యామేజ్ చేస్తుందో తెలుసా?
Cigarette: సిగరెట్లు రోజూ, చాలా ఏళ్లుగా తాగితేనే ఆరోగ్యానికి హానికరమని చాలామంది భావిస్తుంటారు. వారాంతాల్లోనో, పార్టీల్లోనో ఫ్రెండ్స్‌తో కలిసి లేదా ఒత్తిడికి గురైనప్పుడో ఒకటీ అరా కాల్చితే పెద్దగా ఇబ్బందేమీ ఉండదని లైట్ తీసుకుంటారు. దీన్నే 'సోషల్ స్మోకింగ్' అంటారు. కానీ, ఇలా అప్పుడప్పుడూ సిగరెట్లు కాల్చడం కూడా తీవ్రమైన ప్రాణాంతక జబ్బులకు కారణమవుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
పొగాకులో క్యాన్సర్ కారకాలు, విషతుల్య పదార్థాల వంటి 7 వేలకు పైగా ప్రమాదకర రసాయనాలుంటాయి. రోజూ తాగేవారికీ, అప్పుడప్పుడూ కాల్చేవారికీ మధ్య మోతాదులో తేడా ఉండొచ్చు గానీ.. హాని కారకాల ప్రభావం విషయంలో మన శరీరం ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేదు. మీరు కేవలం ఒక్క సిగరెట్ కాల్చినా.. శరీరంలోని కీలక అవయవాలు, వ్యవస్థల మీద దాని ప్రభావం తక్షణమే పడుతుంది. ముఖ్యంగా, పొగాకు పొగకు గుండె రక్తనాళాల వ్యవస్థ చాలా త్వరగా స్పందిస్తుంది.
పొగ తాగిన మరుక్షణంలోనే రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల గుండె వేగం, రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇక పొగలోని కార్బన్‌మోనాక్సైడ్ మూలంగా రక్తంలో ప్రసారమయ్యే ఆక్సిజన్ స్థాయులు పడిపోతాయి. దీంతో శరీరానికి ఆక్సిజన్ అందించడానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. అసలు పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. ఇలా అప్పుడప్పుడు సిగరెట్లు తాగే వారికి కూడా గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పొంచి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వీరికి గుండెపోటు ముప్పే కాదు.. పక్షవాతం, రక్తనాళాల లోపలి గోడ పొర దెబ్బతినడం, రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డలు ఏర్పడటం వంటి ప్రమాదాలూ ఎక్కువే. ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. దీని లక్షణాలు బయటపడే సరికే లోపల జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కాదు.. ఊపిరితిత్తులు దెబ్బతినడం, రకరకాల క్యాన్సర్ల ముప్పూ పెరుగుతుంది.