Experiencing More Forgetfulness With Age: వయసు పైబడే కొద్దీ విషయాలు మర్చిపోవడం సహజమేనని చాలామంది సరిపెట్టుకుంటారు. అయితే, ఈ సాధారణ మతిమరపే ఒక్కోసారి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధికి సంకేతం కావచ్చని న్యూరాలజిస్టులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడాన్ని కేవలం వృద్ధాప్య లక్షణంగా భావించడం వల్లే చాలా సందర్భాల్లో ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 60-65 ఏళ్లు దాటిన వారిలో అల్జీమర్స్ ముప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ, 65 ఏళ్ల లోపు వారిలోనూ ఇది కనిపించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తప్పక గమనించాల్సిన అల్జీమర్స్ ప్రారంభ లక్షణాలు

ఎప్పుడో ఒకసారి పేరు మర్చిపోవడం లేదా వస్తువులను ఎక్కడో పెట్టి మళ్లీ గుర్తుతెచ్చుకోవడం వయసుతో వచ్చే సాధారణ మార్పు కావచ్చు. కానీ కింది లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే అప్రమత్తం కావాలి:

తాజా విషయాలను మాటిమాటికీ మర్చిపోవడం: కొద్దిసేపటి క్రితం జరిగిన సంభాషణలు, పనులను పూర్తిగా మర్చిపోవడం.

ఒకే ప్రశ్నను పదేపదే అడగడం:

సమాధానం చెప్పినప్పటికీ, కాసేపటికే మళ్లీ అదే ప్రశ్నను పునరావృతం చేయడం.

తెలిసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది:

నిత్యం చేసే దినచర్యలు, చిన్న చిన్న లెక్కలు, డబ్బుల నిర్వహణ వంటి వాటిలో తడబడటం.

సరైన పదాలు గుర్తుకురాకపోవడం:

మాట్లాడేటప్పుడు సందర్భానుసారంగా సరైన పదాలను ఉపయోగించలేక ఇబ్బంది పడటం.

దారి తప్పిపోవడం:

రోజూ తిరిగే తెలిసిన ప్రాంతాల్లో సైతం అకస్మాత్తుగా గందరగోళానికి గురై దారి మర్చిపోవడం.

నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు:

ప్రణాళికలు వేయలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం.

ప్రవర్తనలో మార్పులు:

ఆందోళన, చిరాకు, అనుమానం లేదా తీవ్ర నిరాశతో కూడిన ప్రవర్తన కనిపించడం.

ఎవరికి ముప్పు ఎక్కువ?

తీవ్రమైన మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి గడిపేవారు.

అనియంత్రిత రక్తపోటు , మధుమేహం ఉన్నవారు.

కుటుంబంలో అల్జీమర్స్ వ్యాధి చరిత్ర ఉన్నవారు ఈ సమస్య బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.

సమస్య తీవ్రత తగ్గాలంటే ఏం చేయాలి?

అల్జీమర్స్‌కు ప్రారంభ దశలోనే వైద్య చికిత్స అందించడం ద్వారా వ్యాధి వేగంగా ముదరకుండా అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడును చురుగ్గా ఉంచడానికి ఈ క్రింది అలవాట్లను ప్రోత్సహించాలి:

మెదడుకు పదునుపెట్టే వ్యాపకాలు: పజిల్స్, సుడోకు, క్రాస్‌వర్డ్స్ పూరించడం, పుస్తకాలు చదవడం లేదా కొత్త భాష, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివ్‌గా ఉంటాయి.

ఏకాంతాన్ని దూరం చేయడం:

వృద్ధులను ఒంటరిగా ఉంచకుండా బంధువులు, స్నేహితులతో తరచూ మాట్లాడేలా, సమాజంలో కలివిడిగా ఉండేలా చూడాలి.

డిజిటల్ పరికరాలపై ఆధారపడటం తగ్గించడం:

జ్ఞాపకశక్తికి సంబంధించిన చిన్న పనులకు కూడా ఫోన్లపై ఆధారపడకుండా మెదడుతో ఆలోచించేలా అలవాటు చేసుకోవాలి.

Tags: