Fatigue and Joint Pain: అలసట, కీళ్ల నొప్పులా? మీ రోగనిరోధక వ్యవస్థే మీపై దాడి చేస్తోందా? ఈ సంకేతాలను అస్సలు విస్మరించకండి..
అస్సలు విస్మరించకండి..
Fatigue and Joint Pain: మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ .. కొన్ని సందర్భాల్లో దారితప్పి మన శరీర కణాలపైనే ఎదురుదాడి చేస్తుంది. వైద్య పరిభాషలో దీనిని ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షించాల్సిన రక్షణ వ్యవస్థే పొరపాటున ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలపై దాడి చేయడంతో శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలు మొదలవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, టైప్-1 డయాబెటిస్ వంటి సమస్యలు దీనికి ప్రధాన ఉదాహరణలు. చాలామంది రోజువారీ అలసట, నొప్పులను సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, శరీరంలో కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఆటోఇమ్యూన్ వ్యాధులకు సూచిక కావచ్చు.
తప్పక గమనించాల్సిన 5 కీలక హెచ్చరికలు
ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గని తీవ్ర అలసట
సాధారణంగా తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకుంటే అలసట తీరిపోతుంది. అయితే, తగినంత నిద్ర ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం, నిరంతర అలసట వేధిస్తుంటే అది ఆటోఇమ్యూన్ రుగ్మతకు సంకేతం కావచ్చు. శరీరంలో అంతర్గతంగా తలెత్తే తీవ్ర వాపు, రోగనిరోధక వ్యవస్థ అసాధారణ పనితీరు వల్ల రోగి నిరంతరం నిస్సత్తువగా ఉంటాడు.
కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు
కీళ్లలో నిరంతరం నొప్పి ఉండడం, వాపు రావడం, కదలలేకపోవడం వంటి లక్షణాలు ఆటోఇమ్యూన్ సమస్యలను సూచిస్తాయి. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో రోగనిరోధక వ్యవస్థ కీళ్ల లోపలి పొరలపై దాడి చేస్తుంది. ఉదయం నిద్రలేవగానే కీళ్లు గట్టిపడిపోయినట్లు అనిపించి, సాధారణ స్థితికి రావడానికి గంటల సమయం పడుతుంటే అప్రమత్తం కావాలి.
చర్మంపై తరచూ దద్దుర్లు, మార్పులు
చర్మంపై అకస్మాత్తుగా ఎర్రటి దద్దుర్లు, దురద లేదా వింత మార్పులు కనిపించడం ఆటోఇమ్యూన్ వ్యాధులకు ఒక సంకేతం. ఉదాహరణకు లూపస్ వ్యాధిలో ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఎండ తగిలినప్పుడు చర్మం మరింత సున్నితంగా మారడం కూడా ఇందులో భాగమే.
జీర్ణకోశ సమస్యలు
కారణం లేకుండా తరచూ కడుపునొప్పి రావడం, దీర్ఘకాలిక విరేచనాలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఆటోఇమ్యూన్ కారణాలతో ముడిపడి ఉండవచ్చు.
సీలియాక్ వ్యాధి ఆహారంలోని గ్లూటెన్ వల్ల ప్రేగులపై రక్షణ వ్యవస్థ దాడి చేస్తుంది.
క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్
జీర్ణవ్యవస్థలో తీవ్రమైన వాపుకు దారితీస్తాయి.
పునరావృతమయ్యే జ్వరం, శారీరక మార్పులు
ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేకుండానే అకస్మాత్తుగా జ్వరం రావడం, శరీర భాగాలలో తరచూ వాపులు రావడం, తీవ్రమైన కండరాల నొప్పులు కనిపించవచ్చు. వీటితో పాటు అకారణంగా జుట్టు రాలడం, నోటిలో మాటిమాటికీ పుండ్లు పడడం వంటివి కూడా ఆటోఇమ్యూన్ స్థితిని సూచిస్తాయి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
ఈ లక్షణాలు కొద్దిరోజులు ఉండి తగ్గితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే ఈ సమస్యలు చాలా వారాలుగా నిరంతరం కొనసాగుతున్నా.. రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నా, కుటుంబంలో ఎవరికైనా ఆటోఇమ్యూన్ వ్యాధుల చరిత్ర ఉన్నా.. తక్షణమే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు రోగి ఆరోగ్య చరిత్రను పరిశీలించి, రక్త పరీక్షలు చేయడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రణలోకి తీసుకురావచ్చు.