Feeling Hungry Again: ఆకలి వేయడం అనేది శరీరానికి శక్తి అవసరమని సూచించే ఒక సహజ ప్రక్రియ. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంటే లేదా రోజంతా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటే దాన్ని సాధారణ విషయంగా తీసిపారేయకూడదు. కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇలా జరగొచ్చు. కానీ, ఈ సమస్య రోజుల తరబడి కొనసాగుతుంటే మాత్రం శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక సంకేతంగా భావించాలి. నిరంతరం ఎక్కువ ఆకలి వేయడానికి కొన్ని ప్రధాన ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు.

ఆకలి ఎక్కువగా వేయడానికి ప్రధాన కారణాలు..

డయాబెటిస్:

శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల మనం తిన్న ఆహారం నుంచి లభించే గ్లూకోజ్‌ను కణాలు సరిగ్గా వినియోగించుకోలేవు. దీనివల్ల కణాలకు శక్తి అందక శరీరం పదే పదే ఆకలి సంకేతాలను పంపుతుంది.

హైపర్ థైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినప్పుడు శరీరంలో మెటబాలిజం వేగవంతమై శక్తి త్వరగా ఖర్చవుతుంది. దీంతో ఆకలి విపరీతంగా పెరుగుతుంది.

లో బ్లడ్ షుగర్ :

రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పడిపోయినప్పుడు శరీరం వెంటనే గ్లూకోజ్ కోసం తీవ్రమైన ఆకలిని కలిగిస్తుంది.

హార్మోన్ల మార్పులు - మానసిక ఒత్తిడి:

మహిళల్లో పీరియడ్స్ ప్రారంభమయ్యే ముందు హార్మోన్ల మార్పుల వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడి , ఆందోళన ఉన్నప్పుడు కొందరు 'ఎమోషనల్ ఈటింగ్'కు గురై ఎక్కువగా తింటారు.

మందుల ప్రభావం:

కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఆకలి ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఎలాంటి పరీక్షలు అవసరం?

తరచుగా ఆకలి వేసే సమస్యతో డాక్టర్‌ను సంప్రదిస్తే, వారు ముందుగా మీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు ఇతర లక్షణాలను పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి ఈ క్రింది పరీక్షలు సూచించవచ్చు:

బ్లడ్ షుగర్ టెస్ట్

థైరాయిడ్ ప్రొఫైల్

ఇతర రక్త పరీక్షలు

ఎప్పుడు హెచ్చరికగా ఉండాలి?

పదే పదే ఆకలి వేయడంతో పాటు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి..

తింటున్నా కూడా బరువు తగ్గడం.

విపరీతమైన దాహం వేయడం.

పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం.

నిరంతరం నీరసంగా లేదా అలసటగా అనిపించడం.

నివారణ - సూచనలు:

పోషకాహారం తీసుకోవడం:

జంక్ ఫుడ్స్, స్వీట్లకు దూరంగా ఉండి పప్పుధాన్యాలు, గుడ్లు, పాలు, పనీర్, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

సరైన సమయానికి భోజనం:

క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.

తగినంత నీరు తాగడం:

కొన్నిసార్లు శరీరం డిహైడ్రేషన్‌కు గురైనప్పుడు దాహాన్ని కూడా ఆకలిగా భావించే అవకాశం ఉంది, కాబట్టి రోజంతా తగినన్ని నీళ్లు తాగాలి.

Tags: