Four Types of Cancer: భారతీయ పురుషులను వణికిస్తున్న 4 రకాల క్యాన్సర్లు.. హెచ్చరిస్తున్న ఎయిమ్స్ వైద్యులు..
ఎయిమ్స్ వైద్యులు..
Four Types of Cancer: భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి లక్ష మందిలో దాదాపు 100 మంది క్యాన్సర్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ పురుషుల్లో అత్యధికంగా ఏయే క్యాన్సర్లు ప్రబలుతున్నాయి, వాటికి గల కారణాలేంటి అనే అంశాలపై ఢిల్లీ ఎయిమ్స్ రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిషేక్ శంకర్ కీలక వివరాలను వెల్లడించారు.
పురుషుల్లో ఎక్కువగా కనిపించే 4 రకాల క్యాన్సర్లు..
నోటి క్యాన్సర్ :
భారతీయ పురుషుల్లో అత్యంత సాధారణంగా కనిపించేది నోటి క్యాన్సరే. పొగాకు, గుట్కా, పాన్ మసాలా, సున్నం, వక్కలు నమలడం మరియు మితిమీరిన మద్యం సేవించడం వల్ల ఈ ముప్పు తీవ్రమవుతోంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్
ధూమపానం దీనికి ప్రధాన కారణం అయినప్పటికీ, తీవ్రమైన వాయు కాలుష్యం, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ధూమపానం చేయని వారు సైతం దీని బారిన పడుతున్నారు.
కొలొరెక్టల్ క్యాన్సర్:
మారుతున్న ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, పీచు పదార్థం (ఫైబర్) తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం మరియు ఊబకాయం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
కడుపు క్యాన్సర్:
అపరిశుభ్రమైన, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ల కారణంగా పురుషుల్లో కడుపు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
ముప్పు ఎవరికి ఎక్కువ?
వయసు పెరగడం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, అధిక బరువు, ధూమపానం-మద్యపానం అలవాట్లు, అలాగే దీర్ఘకాలికంగా వాయు కాలుష్యానికి గురయ్యే వారికి ఈ క్యాన్సర్ల రిస్క్ చాలా ఎక్కువ.
నిర్లక్ష్యం చేయకూడని ప్రమాదకర లక్షణాలు:
నోటిలో ఎన్ని రోజులైనా మానని పుండ్లు ఉండటం.
గొంతు బొంగురుపోవడం లేదా వాయిస్‌లో మార్పు రావడం.
కారణం లేకుండా బరువు వేగంగా తగ్గడం.
దీర్ఘకాలికంగా దగ్గు వేధించడం.
ఆహారం మింగడంలో తీవ్రమైన ఇబ్బంది.
మలంలో రక్తం పడటం లేదా మలవిసర్జన అలవాట్లలో మార్పులు రావడం.
నిరంతరం కడుపునొప్పి, అజీర్తి వేధించడం.
నిపుణుల సూచన – నివారణ మార్గాలు:
క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పొగాకు, ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.