Gallstones Rising Among Youth Under 30: 30 ఏళ్లలోపు యువతలోనే పిత్తాశయ రాళ్లు.. జంక్ ఫుడ్, ఊబకాయమే శాపమా?

జంక్ ఫుడ్, ఊబకాయమే శాపమా?

Update: 2026-05-29 06:16 GMT

Gallstones Rising Among Youth Under 30: ఇటీవలి కాలంలో యువతను వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో పిత్తాశయ రాళ్లు ఒకటిగా మారుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి, ఇప్పుడు 30 ఏళ్లలోపు ఉన్న యువతీ యువకులలో, ముఖ్యంగా విద్యార్థులు, జిమ్‌కు వెళ్లేవారిలో సైతం సర్వసాధారణం అయిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రాళ్లు ఒక చిన్న ఇసుక రేణువు పరిమాణం నుండి గోల్ఫ్ బంతి పరిమాణం వరకు పెరిగే అవకాశం ఉందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

పిత్తాశయంలో అసలు రాళ్లు ఎలా ఏర్పడతాయి? దీనికి గల కారణాలు, లక్షణాలు మరియు నివారణోపాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పిత్తాశయ రాళ్లు ఎలా ఏర్పడతాయి?

మన శరీరంలోని పిత్తాశయంలో ఉండే పైత్యరసంలో కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ అనే పదార్థాలు అధికంగా పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. వైద్యుల ప్రకారం ఇవి ప్రధానంగా రెండు రకాలు..

కొలెస్ట్రాల్ రాళ్లు:

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు లేదా వంశపారంపర్య కారణాల వల్ల ఇవి ఏర్పడతాయి.

పిగ్మెంట్ రాళ్లు:

రక్తకణాల విచ్ఛిన్నం పెరిగినప్పుడు ఈ చిన్న నల్లటి రాళ్లు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా యువకులలోనే కనిపిస్తుంటాయి.

యువతలో ఈ సమస్య పెరగడానికి ప్రధాన కారణాలు..

నేటి ఆధునిక జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లే యువతను ఈ సమస్య వైపు నెడుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

జంక్ ఫుడ్ - నూనె పదార్థాలు:

పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు వంటి ఫాస్ట్ ఫుడ్ మరియు వేపుళ్లు ఎక్కువగా తినడం.

క్రాష్ డైటింగ్‌లు:

బరువు వేగంగా తగ్గాలనే ఆరాటంతో సరైన అవగాహన లేకుండా కఠినమైన డైటింగ్స్ చేయడం వల్ల కూడా ఈ ముప్పు పెరుగుతుంది.

డీహైడ్రేషన్:

శరీరానికి అవసరమైనంత నీరు తాగకపోవడం.

టైమ్‌కి తినకపోవడం:

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తిగా మానేయడం లేదా క్రమరహిత సమయాల్లో భోజనం చేయడం.

గమనించవలసిన ముఖ్య లక్షణాలు:

చాలా మందిలో ఇవి ప్రారంభంలో ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ సమస్య తీవ్రమైతే క్రింది లక్షణాలు బయటపడతాయి:

పొత్తికడుపు మధ్యలో లేదా కుడి వైపున అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి రావడం.

భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం.

తరచుగా వాంతులు అవ్వడం లేదా అజీర్తి సమస్యలు తలెత్తడం.

ఇన్ఫెక్షన్ ఎక్కువైతే జ్వరం తీవ్రమైన నీరసం రావడం.

పిత్తాశయ రాళ్లను నివారించడానికి చిట్కాలు..

తగినంత నీరు తాగాలి:

శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. ఇది పైత్యరసం గడ్డకట్టకుండా సహాయపడుతుంది.

పీచు పదార్థాలు: ఓట్స్, తృణధాన్యాలు, పచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఫాస్ట్ ఫుడ్‌కు నో చెప్పండి:

నూనెలో బాగా వేయించిన బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి.

సమయపాలన ముఖ్యం:

రోజులో ఏ పూట భోజనాన్ని కూడా స్కిప్ చేయకూడదు. ముఖ్యంగా ఉదయం అల్పాహారం సమయానికి తీసుకోవడం ఎంతో ముఖ్యం.

వయసు చిన్నదే కదా అని కడుపునొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు పదే పదే వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి స్కానింగ్ ద్వారా పరీక్షించుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News