Ignore Fatty Liver and Face a Cancer Risk: నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ ముప్పు.. ఫ్యాటీ లివర్‌ను సహజంగా ఎలా తగ్గించుకోవాలి?
ఎలా తగ్గించుకోవాలి?
Ignore Fatty Liver and Face a Cancer Risk: మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల నేటి రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. కాలేయ కణాలలో మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇది కాలేయ వాపు, సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సరైన ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను సులభంగా నియంత్రించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు కేవలం మందులపైనే ఆధారపడకుండా, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇక్కడ చూద్దాం.
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ముందుగా తమ శరీర బరువును తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు లేదా ఊబకాయం వల్ల కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయి అది వాపుకు, తీవ్ర నష్టానికి దారితీస్తుంది. శరీర బరువులో కనీసం 5 నుంచి 10 శాతం వరకు తగ్గించుకున్నా.. కాలేయంలోని కొవ్వు కరిగిపోయి, కాలేయ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది.
చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరం
ఆహారంలో చక్కెర వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, మిఠాయిలు, కేకులు, బిస్కెట్లు, మైదాతో చేసిన శుద్ధి చేసిన పిండి పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వీటిలో ఉండే అధిక ఫ్రక్టోజ్, చక్కెరలు కాలేయంలో కొవ్వు వేగంగా పేరుకుపోయేలా చేస్తాయి.
ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి
శారీరక శ్రమ లేకపోవడం కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ , సైక్లింగ్, ఈత లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయడం వల్ల కాలేయంలోని కొవ్వు నిల్వలు కరిగిపోతాయి.
పౌష్టికాహారానికి ప్రాధాన్యం
రోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తాజా పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), వాల్‌నట్స్ వంటి నట్స్ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. నూనెలో వేయించిన (డీప్ ఫ్రైడ్), ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, రోజంతా శరీరానికి సరిపడా మంచినీరు తాగడం అలవాటు చేసుకోవాలి.