Fat Building Up in Your Blood Vessels: మీ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతోందా? ఈ 3 ఆహారాలకు ఇప్పుడే నో చెప్పండి
ఈ 3 ఆహారాలకు ఇప్పుడే నో చెప్పండి
Fat Building Up in Your Blood Vessels: నేటి కాలంలో హై కొలెస్ట్రాల్ అనేది ఒక నిశ్శబ్ద శత్రువులా మారింది. చాలామంది అధిక బరువు ఉన్నవారిలోనే కొలెస్ట్రాల్ ఉంటుందని భావిస్తారు. కానీ సన్నగా ఉన్నవారిలో కూడా చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను మూసివేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైపుల్లో ధూళి పేరుకుపోయినట్లుగా, సిరల్లో కొవ్వు చేరితే రక్త ప్రసరణ ఆగిపోయి గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి.
మీ గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే, ఈ మూడు రకాల ఆహారాలను మీ డైట్ నుండి వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేయించిన - ప్రాసెస్ చేసిన ఆహారాలు
మార్కెట్లో సులభంగా దొరికే సమోసాలు, కచోరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన చిప్స్‌లలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా మన శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేస్తాయి. కాబట్టి ఈ రోజే వీటిని తినే అలవాటుకు స్వస్తి చెప్పండి.
రెడ్ మీట్ - ప్రాసెస్ చేసిన మాంసం
మటన్, బీఫ్ వంటి రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ఇంకా ప్రమాదకరమైనవి సాసేజ్‌లు, సలామీ, హాట్ డాగ్‌లు వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే ఉప్పు, రసాయనాలు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
చక్కెర - శుద్ధి చేసిన పిండి పదార్థాలు
చక్కెరకు, కొలెస్ట్రాల్‌కి సంబంధం లేదని అనుకుంటే పొరపాటే! మనం తీసుకునే స్వీట్లు, కూల్ డ్రింక్స్, తెల్ల బ్రెడ్, పాస్తా, బిస్కెట్లలో ఉండే చక్కెరను కాలేయం ట్రైగ్లిజరైడ్స్ గా మారుస్తుంది. ఇవి రక్తంలో పెరిగినప్పుడు కొలెస్ట్రాల్ నియంత్రణ తప్పుతుంది. అందుకే చక్కెర తీసుకోవడం వీలైనంత తగ్గించాలి.
కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి?
మీ రక్తనాళాలను శుభ్రంగా ఉంచుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి..
పీచు పదార్థం: ఓట్స్, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోండి. ఇవి సిరల్లో ఉన్న అదనపు కొవ్వును గ్రహించి శరీరం నుండి బయటకు పంపిస్తాయి.
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ వంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ తప్పనిసరి.