Tea or Coffee Too Hot: ఉదయం నిద్ర లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ లేదా కాఫీ తాగడం చాలామందికి ఒక వ్యసనం లాంటి అలవాటు. టీ చల్లారితే రుచి ఉండదని, ఎంత వేడిగా ఉంటే అంత మజా అని భావించే వారికి తాజా అధ్యయనాలు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నాయి. మితిమీరిన వేడితో కూడిన పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆహారవాహిక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతోందని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

అత్యధిక ఉష్ణోగ్రతతో అన్నవాహికకు ఏం జరుగుతుంది?

సాధారణంగా మన నోరు, గొంతు, ఆహారవాహిక లోపలి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. 60°C నుంచి 65°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను వేగంగా తాగినప్పుడు.. తీవ్రమైన వేడి కారణంగా అన్నవాహిక లోపలి కణాలు కాలిపోయి, దీర్ఘకాలికంగా గాయాలు ఏర్పడతాయి.

నిరంతర వాపు తరచూ వేడి టీ తాగడం వల్ల ఈ లోపలి పొరలు మాటిమాటికీ దెబ్బతిని వాపునకు గురవుతాయి.

క్యాన్సర్ కణాల ఉత్పత్తి

గాయపడిన కణాలు మళ్లీ మళ్లీ మరమ్మతు చేసుకునే ప్రక్రియలో జన్యుపరమైన మార్పులు జరిగి, అవి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు వేగవంతమవుతాయి.

ధూమపానం, మద్యపానంతో కలిస్తే మరింత ప్రమాదం..

కేవలం వేడి టీ మాత్రమే కాకుండా, ధూమపానం లేదా మద్యం అలవాటు ఉన్నవారు ఇలాంటి మితిమీరిన వేడి పానీయాలు తీసుకుంటే ఈ ముప్పు రెట్టింపు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వేడి వల్ల దెబ్బతిన్న సున్నితమైన కణజాలంపై పొగాకు, ఆల్కహాల్‌లోని హానికర రసాయనాలు మరింత వేగంగా ప్రభావం చూపి క్యాన్సర్‌కు దారితీస్తాయి.

నిర్లక్ష్యం చేయకూడని ప్రధాన లక్షణాలు..

ఘన లేదా ద్రవ ఆహారాన్ని మింగేటప్పుడు గొంతు లేదా ఛాతీ భాగంలో నొప్పి, ఇబ్బంది కలగడం.

ఛాతీ మధ్యలో మంట, విపరీతమైన అసౌకర్యం.

కారణం లేకుండా వేగంగా బరువు తగ్గిపోవడం.

గొంతు బొంగురుపోవడం లేదా నిరంతరం వేధించే పొడి దగ్గు.

నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు

టీ లేదా కాఫీ తయారైన వెంటనే గటగటా తాగేయకూడదు.

కప్పులో పోసిన తర్వాత కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు ఆగి, అది తాగడానికి అనుకూలమైన గోరువెచ్చని లేదా మితమైన ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే సిప్ చేయాలి.

టీతో పాటు ధూమపానం చేసే అలవాటు ఉంటే తక్షణమే దానికి స్వస్తి పలకాలి.

Tags: