Loss of Appetite and Unexplained Weight Loss: మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం వంటి మార్పులు సహజంగా జరుగుతుంటాయి. అయితే ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండా లేదా వ్యాయామం చేయకుండానే హఠాత్తుగా బరువు తగ్గిపోతుంటే మాత్రం దానిని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది శరీరంలో పెరుగుతున్న తీవ్రమైన వ్యాధికి, ముఖ్యంగా క్యాన్సర్‌కు సంబంధించిన ముందస్తు సంకేతం కావచ్చు.

ఆకలి తగ్గడం - బరువు తగ్గడం

వైద్యుల సమాచారం ప్రకారం.. శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు అవి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. క్యాన్సర్ కణాలు శరీరం నుండి అధిక శక్తిని తీసుకుంటాయి, దీనివల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఆకలి మందగించడం:

జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగాల్లో (జీర్ణాశయం, కాలేయం, ప్యాంక్రియాస్ మొదలైనవి) క్యాన్సర్ గడ్డలు ఏర్పడినప్పుడు ఆకలి వేయకపోవడం, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్లు అనిపించడం లేదా వికారం రావడం జరుగుతుంది.

అకస్మాత్తుగా బరువు తగ్గడం:

ఏ కారణం లేకుండానే 6 నెలల వ్యవధిలో శరీర బరువులో 5శాతం లేదా అంతకంటే ఎక్కువ తగ్గిపోతుంటే దానిని ప్రమాదకర సంకేతంగా భావించాలి.

ఏ రకమైన క్యాన్సర్లకు ఇవి ముఖ్య లక్షణాలు?

పాంక్రియాటిక్ క్యాన్సర్

స్టమక్, జీర్ణాశయ క్యాన్సర్

కాలేయ క్యాన్సర్

అన్నోదర, ఈసోఫేగస్ క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఇతర అనుమానాస్పద లక్షణాలు..

ఆకలి తగ్గడం, బరువు తగ్గడంతో పాటు ఈ క్రింది సమస్యలు నిరంతరం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి..

కారణం లేని విపరీతమైన నీరసం అలసట

ఆహారం మింగడంలో ఇబ్బంది లేదా గొంతులో నొప్పి

కడుపులో ఉబ్బరం, తీవ్రమైన అసౌకర్యం లేదా నిరంతర కడుపునొప్పి

చర్మంలో పసుపు రంగు లేదా మలంలో రక్తం పడటం

ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?

అకస్మాత్తుగా ఆకలి తగ్గిపోవడం లేదా గణనీయంగా బరువు తగ్గిపోవడం వంటి మార్పులు 2 నుండి 3 వారాలకు పైగా కొనసాగుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి అవసరమైన స్క్రీనింగ్ మరియు రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయడం సులువవుతుంది.

Tags: