Over 30: మారుతున్న జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి, సమయానికి తినకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే గుండెపోటు, మధుమేహం, బీపీ వంటి సమస్యలు ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయంలోనే బయటపడుతున్నాయి. చాలామంది శరీరంలో ఏదైనా తీవ్రమైన సమస్య లేదా నొప్పి వస్తే తప్ప ఆసుపత్రి గడప తొక్కరు. అయితే, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తగా ఏడాదికి ఒకసారైనా కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

30 ఏళ్ల తర్వాత తప్పక చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు..

రక్తపోటు పరీక్ష

హైపర్‌టెన్షన్‌ను సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీ పెరిగినప్పుడు బయటకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఇది గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, పక్షవాతానికి దారితీస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

బ్లడ్ షుగర్ టెస్ట్

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ , పోస్ట్ ప్రాండియల్ తో పాటు గత 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే HbA1c పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల డయాబెటిస్ ప్రారంభ దశలోనే ఉందా లేదా ప్రీ-డయాబెటిస్ స్టేజ్‌లో ఉందా అనేది స్పష్టంగా తెలుస్తుంది.

లిపిడ్ ప్రొఫైల్

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ తక్కువగా ఉండి, డెస్క్ జాబ్స్ చేసేవారు ఈ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

లివర్ & కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లు

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే ముఖ్యమైన అవయవాలు కాలేయం, మూత్రపిండాలు. సిరమ్ క్రియాటినిన్, యూరియా, లివర్ ఎంజైమ్‌ల స్థాయిలను పరీక్షించడం ద్వారా ఈ అవయవాల పనితీరును అంచనా వేయవచ్చు.

విటమిన్ డి, విటమిన్ బి12 పరీక్షలు

ప్రస్తుతం ఎక్కువమందిని వేధిస్తున్న సమస్యలు విటమిన్ డి, బి12 లోపాలు. ఎండ తగలకపోవడం వల్ల విటమిన్ డి తగ్గి ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు వస్తాయి. బి12 లోపం వల్ల నరాల బలహీనత, నిరంతర అలసట, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు

30 ఏళ్లు పైబడిన మహిళలు థైరాయిడ్ ప్రొఫైల్ తో పాటు, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తింపు కోసం పాప్ స్మియర్ వంటి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం మంచిది.

ముందస్తు పరీక్షల వల్ల ప్రయోజనం ఏమిటి?

ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ప్రాథమిక దశలోనే బయటపడుతుంది. సమస్య తీవ్రం కాకముందే ఆహార నియమాలు, వ్యాయామం లేదా స్వల్ప ఔషధాలతో పూర్తిగా నియంత్రించవచ్చు. భవిష్యత్తులో వచ్చే భారీ వైద్య ఖర్చులు, తీవ్ర మానసిక ఆందోళనలను నివారించవచ్చు.

Tags: