Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పాలు తాగకూడదా? అసలు నిజం ఇది..
అసలు నిజం ఇది..
Kidney Stones: నేటి కాలంలో కిడ్నీలో రాళ్లు అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. తప్పుడు ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత నీరు అందకపోవడం వల్ల చిన్న వయసులోనే చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పాలు తాగితే రాళ్ల పరిమాణం పెరుగుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. మరి ఇందులో నిజమెంత? అనేది తెలుసుకుందాం.
పాలు తాగవచ్చా? నిపుణుల వివరణ ఇదీ..
చాలామంది పాలలో కాల్షియం ఉంటుందని, అది కిడ్నీలోని 'కాల్షియం ఆక్సలేట్' రాళ్లను మరింత పెంచుతుందని భయపడతారు. కానీ డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం..
పరిమితంగా తాగవచ్చు: పాలను మితంగా తీసుకోవడం వల్ల కిడ్నీ రాళ్ల సమస్య పెరగదు.
ఆక్సలేట్ తొలగింపు: పాలలోని కాల్షియం మనం తీసుకునే ఇతర ఆహారాల్లోని ఆక్సలేట్‌తో కలిసిపోతుంది. ఒకవేళ రాయి పరిమాణం 5 మి.మీ. కంటే తక్కువగా ఉంటే, అది మూత్రం ద్వారా బయటకు వెళ్లడానికి ఈ ప్రక్రియ సహాయపడుతుంది.
భయం వద్దు: కాల్షియం అధికంగా ఉందని పాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ మోతాదు మించకుండా చూసుకోవాలి.
కిడ్నీ రాళ్లు ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఆహారం విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే రాళ్ల సంఖ్య పెరగడానికి కారణమవుతాయి. కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ క్రింది చిట్కాలు పాటించండి..
నీరు ఎక్కువగా తాగాలి: రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. ఇది కిడ్నీలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పు తగ్గించాలి: ఆహారంలో ఉప్పు అధికంగా ఉంటే రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
ప్రోటీన్ పరిమితి: మాంసాహారం లేదా అధిక ప్రోటీన్ ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.
ఈ ఆహారాలకు దూరం: పాలకూర, చాక్లెట్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి.
చిన్న రాళ్లను మందులతో కరిగించవచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే అవి పెద్దవిగా మారి శస్త్రచికిత్సకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.