Sleeping Less: నిద్ర తగ్గుతోందా.. ? రోజుకు 6 గంటల కంటే తక్కువ పడుకుంటే శరీరంలో జరిగే ఘోరాలు ఇవే..
శరీరంలో జరిగే ఘోరాలు ఇవే..
Sleeping Less: నేటి ఆధునిక జీవనశైలి, కెరీర్ ఒత్తిడి, అర్ధరాత్రి వరకు స్మార్ట్‌ఫోన్‌ల వాడకం కారణంగా చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి రాత్రి పూట కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు రోజూ 6 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రపోతున్నారా? అయితే మీ శరీరానికి మీరే నెమ్మదిగా హాని చేసుకుంటున్నట్లే.
నిరంతర నిద్రలేమి వల్ల శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై ఎలాంటి దారుణమైన ప్రభావం పడుతుందో ఆరోగ్య అధ్యయనాలు వెల్లడించిన కొన్ని నమ్మలేని నిజాలు ఇక్కడ ఉన్నాయి..
రెట్టింపు కానున్న మధుమేహం ప్రమాదం..
మీరు తక్కువగా నిద్రపోయినప్పుడు, శరీరంలో ఆకలిని, జీవక్రియలను నియంత్రించే హార్మోన్ల సమతుల్యత తప్పుతుంది. రోజుకు 7-8 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే, 5 నుండి 6 గంటలు మాత్రమే పడుకునే వారికి ప్రీ-డయాబెటిస్ లేదా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
గుండె జబ్బులు 27శాతం పెరిగే అవకాశం..
దాదాపు 4,000 మందిపై జరిపిన ఒక ప్రత్యేక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. రాత్రి వేళల్లో ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అథెరోస్క్లెరోసిస్ సమస్య వచ్చే అవకాశం 27శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇది కాలక్రమేణా గుండెపోటుకు దారితీస్తుంది.
మెదడు పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి లోపం..
మనం నిద్రపోతున్న సమయంలో మెదడు తనను తాను క్లీన్ చేసుకుంటుంది. రోజంతా పేరుకుపోయిన అనవసరమైన విషపదార్థాలను తొలగించి, జ్ఞాపకాలను భద్రపరుస్తుంది. కానీ నిద్ర కరువైతే.. ఏకాగ్రత లోపించడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. పగటిపూట తీవ్రమైన నీరసం, నిద్రమత్తు వేధిస్తాయి.
శరీర రక్షణ వ్యవస్థలపై నిద్రలేమి దెబ్బ:
బలహీనపడే రోగనిరోధక శక్తి:
ఇన్ఫెక్షన్లతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ నిద్రలేమి వల్ల పూర్తిగా బలహీనపడుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు, బాడీ ఇన్ఫ్లమేషన్ (వాపులు) వేగంగా పెరుగుతాయి.
థైరాయిడ్, హార్మోన్ల హెచ్చుతగ్గులు:
నిద్రలోనే శరీరం గ్రోత్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నిద్ర తగ్గితే థైరాయిడ్ పనితీరు, జీవక్రియలు దెబ్బతిని ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.
డిప్రెషన్, మూడ్ స్వింగ్స్
నిరంతర నిద్రలేమి మెదడులోని డోపమైన్, సెరోటోనిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్ల స్థాయిలను పడేస్తుంది. ఫలితంగా తీవ్రమైన మానసిక ఆందోళన , డిప్రెషన్‌కు దారితీస్తుంది.
ఈ డిజిటల్ కాలంలో పనులను, వినోదాన్ని కాసేపు పక్కన పెట్టి, శరీరానికి కావాల్సిన 7-8 గంటల నిద్రను అందించడం విలాసం కాదు... అది ఒక అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేటి నుంచే సరైన సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి