During Monsoon: వర్షాకాలంలో మహిళలు చేసే ఆ చిన్న పొరపాట్లే పెద్ద ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు..
ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు..
During Monsoon: వర్షాకాలం రాగానే వాతావరణం చల్లబడి ఉపశమనం లభించినప్పటికీ, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. ఈ సీజన్‌లో వర్షాలు, గాలిలో అధికంగా ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ చాలా వేగంగా వృద్ధి చెందుతాయి. అందువల్ల ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అత్యవసరం. ముఖ్యంగా మహిళలు ఋతుస్రావం సమయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేసినా.. అవి తీవ్రమైన దురద, అలర్జీలు మరియు జననాంగ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో పీరియడ్స్ సమయంలో మహిళలు తరచుగా చేసే పొరపాట్లు, వాటి నివారణా మార్గాలు ఇవే..
వర్షాకాలంలో మహిళలు చేసే ప్రధాన పొరపాట్లు
ప్యాడ్లను సకాలంలో మార్చకపోవడం: వర్షాకాలంలో చెమట తక్కువగా పట్టడం, రక్తం స్రావం కూడా తక్కువగా ఉందనే భావనతో చాలా మంది మహిళలు ఒకే ప్యాడ్‌ను రోజంతా ఉపయోగిస్తుంటారు. రక్తస్రావం ఎంత ఉన్నా, ప్రతి 4 నుండి 6 గంటలకు ఒకసారి తప్పనిసరిగా ప్యాడ్ మార్చాలి. లేదంటే ఆ తేమలో బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది.
తడి దుస్తులు ధరించడం: ఈ సీజన్‌లో బట్టలు త్వరగా ఆరవు. సరిగ్గా ఆరని, తేమ ఉన్న లోదుస్తులను ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువ. ఎల్లప్పుడూ పూర్తిగా ఆరిన, సుతిమెత్తని కాటన్ లోదుస్తులనే వాడాలి.
ఘాటైన సబ్బులు, ప్రొడక్ట్స్ వాడటం: దుర్వాసన వస్తుందనే కారణంతో జననాంగాల వద్ద ఘాటైన కేమికల్ సబ్బులు లేదా వాష్‌లను వాడటం సరైనది కాదు. ఇది శరీర సహజ pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. కేవలం పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవడమే అత్యంత సురక్షితం.
మెన్స్ట్రువల్ కప్ : కప్‌లు లేదా టాంపోన్‌లను సమయానికి మార్చకపోవడం ప్రమాదకరం. మెన్స్ట్రువల్ కప్‌లను ఉపయోగించే ముందు మరియు పీరియడ్స్ ముగిసిన తర్వాత వేడి నీటిలో మరిగించి క్రిమిరహితం చేయడం మర్చిపోకూడదు.
బాత్రూమ్‌లలో ప్యాడ్లను నిల్వ ఉంచడం: చాలా మంది బాత్రూమ్‌లోనే శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్లను ఉంచుతారు. బాత్రూమ్‌లోని తేమ వల్ల ప్యాడ్లపై కంటికి కనిపించని బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. ప్యాడ్లను ఎప్పుడూ పొడిగా ఉండే డ్రాయర్లు లేదా కవర్లలోనే నిల్వ చేయాలి.
ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే..
కాటన్ దుస్తులకే ప్రాధాన్యం: గాలి ప్రసరణ బాగుండేలా సింథటిక్ దుస్తులకు బదులు కాటన్ లోదుస్తులను మాత్రమే వాడాలి.
పుష్కలంగా నీరు తాగాలి: దాహం వేయకపోయినా సరిపడా నీరు తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటకు పోయి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధించవచ్చు.
చేతుల పరిశుభ్రత: ప్యాడ్లు మార్చడానికి ముందూ, మార్చిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
వర్షాకాలంలో పీరియడ్స్ సమయంలో తీవ్రమైన దురద, దుర్వాసన, అసాధారణ తెల్లబట్ట లేదా కడుపునొప్పి వంటి సమస్యలు కనిపిస్తే, సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.