Sudden Swelling in Your Hands or Legs: చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు కనిపించినప్పుడు చాలామంది దాన్ని వేడి చేయడం వల్లనో, రోజంతా నిలబడి అలసిపోవడం వల్లనో లేదా ఏదైనా చిన్న దెబ్బ తగలడం వల్లనో వచ్చిందని భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ వాపు తగ్గకుండా ఉంటే లేదా రోజురోజుకూ పెరుగుతుంటే మాత్రం అస్సలు తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది లింఫెడెమా అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

లింఫెడెమా అంటే ఏమిటి?

మన శరీరంలో లింఫాటిక్ సిస్టమ్ అనే నాళాలు, గ్రంథుల నెట్‌వర్క్ ఉంటుంది. కణజాలాల నుంచి అదనపు ద్రవాలను సేకరించి మళ్లీ రక్తంలోకి పంపడం, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం దీని ప్రధాన విధి. ఈ వ్యవస్థలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినా లేదా దెబ్బతిన్నా, ద్రవాలు అవయవాల కణజాలాల్లో పేరుకుపోతాయి. దీనివల్ల కాళ్లు, చేతుల్లో తీవ్రమైన వాపు వస్తుంది. కొన్నిసార్లు ముఖం, మెడ, పొట్ట భాగాల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.

ప్రారంభ సంకేతాలు - గుర్తులు

లెంఫెడెమా ప్రారంభ దశలో తీవ్రమైన వాపు కనిపించకపోవచ్చు, కానీ కొన్ని సూక్ష్మ మార్పుల ద్వారా దీనిని గుర్తించవచ్చు.

ఒక చెయ్యి లేదా కాలు మరొకదాని కంటే కాస్త బరువుగా అనిపించడం.

క్రమంగా వేలికి వేసుకునే ఉంగరం టైట్ అవ్వడం.

వాచ్ ధరించే మణికట్టుపై లోతైన మచ్చలు, మార్కులు పడటం.

ఒకవైపు వేసుకునే దుస్తులు లేదా చెప్పులు టైట్‌గా అనిపించడం.

ఎందుకు ప్రమాదకరం?

లింఫెడెమాను సకాలంలో గుర్తించకపోతే, అది చర్మాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది. క్రమంగా నడవడానికి, కూర్చోవడానికి, నిలబడటానికి మరియు రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర అవరోధంగా మారుతుంది.

చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

లింఫెడెమాకు అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

కంప్రెషన్ దుస్తులు: ద్రవాలు పేరుకుపోకుండా నిరోధించేందుకు ప్రత్యేకమైన బ్యాండేజీలు లేదా కంప్రెషన్ గార్మెంట్స్ ధరించడం.

వ్యాయామం: క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలు రక్తనాళాల చుట్టూ ఉన్న కండరాలను ఉత్తేజపరిచి, ద్రవాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.

చర్మ సంరక్షణ: వాపు ఉన్న ప్రాంతంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చర్మాన్ని పరిశుభ్రంగా, జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

Tags: