Taking Omega-3 Supplements: ఒమేగా-3 సప్లిమెంట్లు వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Taking Omega-3 Supplements: ఈ రోజుల్లో గుండె, మెదడు, కళ్ల ఆరోగ్యం మెరుగుపర్చుకోవడానికి చాలామంది ఒమేగా-3 సప్లిమెంట్లను ఉపయోగించడం సాధారణమైపోయింది. ఒమేగా-3 అనేది శరీరంలో పలు కీలక ప్రక్రియలకు తోడ్పడే ఒక హెల్దీ ఫ్యాట్. అయితే ప్రకటనలు చూసి లేదా సోషల్ మీడియా ప్రచారాలను నమ్మి వీటిని ఇష్టారాజ్యంగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ నివేదిక ప్రకారం.. ఒమేగా-3 సప్లిమెంట్లు వాడే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, జాగ్రత్తలు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికీ సప్లిమెంట్లు అవసరం లేదు
మనం తీసుకునే రోజువారీ ఆహారం ద్వారా ఒమేగా-3 సరిపడా లభిస్తుంటే, ప్రత్యేకంగా బయట లభించే సప్లిమెంట్లు వాడాల్సిన అవసరం ఉండదు. సప్లిమెంట్లు ఎప్పుడూ సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.
ఒమేగా-3 లభించే సహజ సిద్ధమైన ఆహారాలు
రోజూవారీ ఆహారం ద్వారానే ఒమేగా-3 లోపాన్ని అధిగమించవచ్చు.
మాంసాహారులకు: సాల్మాన్, సార్డిన్, మాకెరెల్ వంటి చేపలు.
శాకాహారులకు: వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, సోయాబీన్ నూనె.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు?
అధికంగా లేదా సరైన నియంత్రణ లేకుండా సప్లిమెంట్లు తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
నోటి నుంచి చేపల వాసన రావడం, నోటి రుచి మారడం.
కడుపులో తిప్పడం, వికారం, గుండెల్లో మంట, విరోచనాలు, గ్యాస్, తేన్పులు రావడం.
ముఖ్య గమనిక: ఒమేగా-3 ని మోతాదుకు మించి తీసుకుంటే రక్తం పలుచబడి, గాయాలైనప్పుడు లేదా సర్జరీ సమయంలో ఎక్కువ రక్తం స్రావమయ్యే ప్రమాదం పెరుగుతుంది.
వీరు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి
కింది విభాగాలకు చెందినవారు సప్లిమెంట్లు ప్రారంభించే ముందు ఖచ్చితంగా డాక్టర్ అభిప్రాయం తీసుకోవాలి:
గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు.
రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నవారు.
త్వరలో సర్జరీ, ఆపరేషన్ చేయించుకోబోయే రోగులు.
చేపలు లేదా ఇతర ఆహార పదార్థాల వల్ల అలర్జీ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.