Headache Medicines Too Often: ఎక్కువగా తలనొప్పి మందులు వాడితే శరీరంలో ఏం జరుగుతుందంటే..?
ఏం జరుగుతుందంటే..?
Headache Medicines Too Often: చిన్నపాటి తలనొప్పి వచ్చినా, నడుము పట్టేసినా, కీళ్ల నొప్పులు బాధిస్తున్నా.. వెంటనే మెడికల్ షాపునకు వెళ్లి పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. మాత్ర వేసుకోగానే తాత్కాలిక ఉపశమనం లభిస్తుండటంతో దీన్నో తేలికపాటి పరిష్కారంగా భావిస్తున్నారు. అయితే ఈ అలవాటు శరీరంలో అత్యంత కీలకమైన మూత్రపిండాలను నిశ్శబ్దంగా నాశనం చేస్తోందని ప్రముఖ నెఫ్రాలజిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ సలహా లేకుండా వాడటమే ప్రధాన సమస్య
విచక్షణారహితంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు విఫలమై దవాఖానలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డాక్టర్లు స్పష్టం చేశారు. గతంలో ఏదో ఒక సమస్యకు డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను ఆధారంగా చేసుకుని, భవిష్యత్తులో నొప్పి వచ్చిన ప్రతిసారీ వైద్యుడిని సంప్రదించకుండా నేరుగా మందుల దుకాణాల నుంచి కొనుగోలు చేసి వేసుకోవడం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
మూత్రపిండాలపై ప్రభావం ఎలా ఉంటుంది?
నొప్పి నివారణ మందులు కిడ్నీల్లోకి జరిగే సాధారణ రక్తప్రసరణ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ మందులను తరచుగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు క్రమంగా మందగిస్తుంది.
బీపీ, షుగర్ బాధితులకు ముప్పు ఎక్కువ:
ఇప్పటికే మధుమేహం (డయాబెటిస్), బీపీ ఉన్నవారి మూత్రపిండాలు ఒత్తిడిలో ఉంటాయి. అలాంటి వారు నొప్పి నివారణ మందులు వాడితే ముప్పు రెట్టింపవుతుంది.
వృద్ధులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి:
వృద్ధులకు, గతంలోనే కిడ్నీ సమస్యలు తలెత్తిన వారికి ఈ అలవాటు ప్రాణాంతకంగా మారే అవకాశముంది.
డీహైడ్రేషన్ సమయంలో మరీ ప్రమాదం
శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడటం మరింత ప్రమాదకరమని కిడ్నీ మార్పిడి విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రజిత్ మజుందార్ హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి పరిస్థితుల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఆ సమయంలో సరిపడా నీరు తాగకుండా పెయిన్ కిల్లర్స్ వాడితే మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే ఆస్కారం ఉంది.
లక్షణాలు కనిపించవు.. రక్తపరీక్షల్లోనే బయటపడే చేదు నిజం!
కిడ్నీ వైఫల్యం ప్రారంభ దశలో ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించకపోవడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. రోగి ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తాడు. ఇతర అనారోగ్య కారణాల వల్ల రక్తపరీక్ష చేయించినప్పుడు మాత్రమే శరీరంలో సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు విపరీతంగా పెరిగినట్లు ఆలస్యంగా తెలుస్తుంది. ఆ స్థితికి చేరిన తర్వాత చికిత్స అందించడం వైద్యులకు కూడా సవాలుగా మారుతుంది.
వైద్యుల సూచన:
నొప్పి పదేపదే బాధిస్తుంటే తాత్కాలిక మాత్రలతో అణచివేయకుండా, సమస్యకు గల మూలకారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి.
అత్యవసరమైతే తప్ప నొప్పి నివారణ మందులను వాడకూడదు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంత వైద్యం రూపంలో మెడికల్ షాపుల నుంచి పెయిన్ కిల్లర్స్ కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలి.