Yellow or Green Lemon: పసుపు నిమ్మకాయ, పచ్చ నిమ్మకాయ.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ఆరోగ్యానికి ఏది మంచిది?
Yellow or Green Lemon: మన వంటింట్లో నిత్యం కనిపించే పండ్లలో నిమ్మకాయలు చాలా ముఖ్యమైనవి. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు మనకు పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు, అలాగే పచ్చగా ఉండే నిమ్మకాయలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూడగానే... "అసలు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? దేనిలో పోషకాలు ఎక్కువ?" అనే అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది.
ముందుగా పసుపు నిమ్మకాయ విషయానికి వస్తే... ఇవి పరిమాణంలో కొంచెం పెద్దవిగా, తీపి-పులుపు కలయికతో ఉంటాయి. వీటిలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి పసుపు నిమ్మకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి.
మరి పచ్చ నిమ్మకాయల సంగతి ఏంటి? ఇవి పరిమాణంలో కొద్దిగా చిన్నవిగా ఉండి, పసుపు నిమ్మకాయల కంటే ఎక్కువ పుల్లగా, కాస్త చేదు టచ్‌తో ఉంటాయి. అయితే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడే గుణాలు, శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపే శక్తి పచ్చ నిమ్మకాయల్లో ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? నిజానికి, పోషకాల పరంగా చూస్తే ఈ రెండింటి మధ్య చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది. రెండూ కూడా బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సమానంగా సహాయపడతాయి.మీకు విటమిన్ సి కాస్త తియ్యటి పులుపు రుచి కావాలనుకుంటే పసుపు నిమ్మకాయను ఎంచుకోండి. అలా కాకుండా, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, ఘాటైన పులుపు కావాలనుకుంటే పచ్చ నిమ్మకాయను వాడండి.