Tulsi and Black Pepper Decoction: తులసి- మిరియాల కషాయంతో అద్భుత ప్రయోజనాలు
అద్భుత ప్రయోజనాలు
Tulsi and Black Pepper Decoction: చలిగాలులు, వాతావరణంలో మార్పులు మొదలవ్వగానే... చాలామందిని వేధించే ప్రధాన సమస్యలు జ్వరం, గొంతునొప్పి, దగ్గు. ఈ కాలంలో ఇవి సర్వసాధారణంగా వచ్చేవే అయినప్పటికీ... వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ ఎంత ఉంది? అది ఎన్ని రోజులుగా వస్తోంది? అనే విషయాలను నిశితంగా గమనించుకోవాలి. ఒకవేళ రెండు లేదా మూడు రోజుల కంటే ఎక్కువగా జ్వరం కొనసాగితే... ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
అయితే... జ్వరం వచ్చిన ఈ ప్రారంభ రెండు, మూడు రోజులలో... శరీరం అలసటకు గురికాకుండా ఉండడానికి, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్‌మెంట్ కొన్ని అద్భుతమైన ఆయుర్వేద పద్ధతులను, హోమ్ రెమెడీస్‌ను సూచిస్తోంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఔషధ గుణాలు కలిగిన వస్తువులతో... ఇంట్లోనే కషాయాలను తయారు చేసుకుని తాగడం వల్ల, ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్లు పోవడమే కాదు... ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా అద్భుతంగా పెరుగుతాయి.
అలా ఈ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తూ... బాడీకి మంచి బూస్టింగ్ ఇచ్చే "తులసి - నల్లమిరియాల కషాయం" ఎంతో మేలని ఆయుష్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేస్తోంది.
మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని... అందులో ఒక గుప్పెడు శుభ్రం చేసిన తులసి ఆకులు, అర చెంచా నల్లమిరియాల పొడి, కొద్దిగా అల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఆ నీరు సగానికి మరిగిన తర్వాత... వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
తులసిలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే, నల్లమిరియాలు గొంతు గరగరను తగ్గించి, కఫాన్ని కరిగిస్తాయి. అల్లం శరీరానికి వేడిని అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవడం వల్ల... శ్వాసకోస సమస్యలు దూరం కావడమే కాకుండా, వైరల్ జ్వరాల బారి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.