Earbuds Silently Damaging Your Hearing: నిశ్శబ్దంగా వినికిడి శక్తిని హరిస్తున్న ఇయర్‌బడ్స్.. చెవుల లోపల ఏం జరుగుతుందో తెలుసా?
ఏం జరుగుతుందో తెలుసా?
Earbuds Silently Damaging Your Hearing: ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ పనిలో ఉన్నా, వ్యాయామం చేస్తున్నా.. నేటి యువత చెవుల్లో ఇయర్‌బడ్స్ లేదా ఇయర్‌ఫోన్స్ తప్పనిసరి అయిపోయాయి. అయితే గంటల తరబడి అధిక సౌండ్‌తో వీటిని ఉపయోగించడం వల్ల వినికిడి శక్తి క్రమంగా నశిస్తుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మనం నిత్యం వాడే ఇయర్‌బడ్స్ మన చెవుల లోపల ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో వైద్యులు శాస్త్రీయంగా వివరిస్తున్నారు.
చెవుల లోపల ఏం జరుగుతుంది?
మన చెవి లోపలి భాగంలో కోక్లియా అనే ముఖ్యమైన అవయవం ఉంటుంది. ఇది శబ్ద తరంగాలను గుర్తించి మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ కోక్లియా లోపల వేలాది సూక్ష్మ హెయిర్ సెల్స్ ఉంటాయి. సాధారణ హెడ్‌ఫోన్‌లతో పోలిస్తే, ఇయర్‌బడ్స్‌ను మనం నేరుగా చెవి రంధ్రం లోపలికి పెడతాం. దీనివల్ల శబ్ద తరంగాలు ఏమాత్రం బయటకు పోకుండా నేరుగా కర్ణభేరిని ఢీకొంటాయి. ఇది శబ్ద తీవ్రతను దాదాపు 9 డెసిబెల్స్ వరకు పెంచుతుంది. మనం మొబైల్‌లో సగానికి పైగా వాల్యూమ్ పెంచి ఎక్కువ సేపు విన్నప్పుడు, ఆ తీవ్రమైన శబ్ద తరంగాలు లోపలి చెవిలోని సూక్ష్మ హెయిర్ సెల్స్‌ను దెబ్బతీస్తాయి.
గమనించాల్సిన ముఖ్య విషయం:
మానవ శరీరంలోని ఇతర కణాలు దెబ్బతింటే మళ్లీ పునరుత్పత్తి అవుతాయి. కానీ, లోపలి చెవిలోని ఈ హెయిర్ సెల్స్ ఒకసారి నశిస్తే, అవి జీవితంలో మళ్లీ తిరిగి రావు. ఒక నిర్దిష్ట శాతం కణాలు నశించగానే, ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన శబ్దాలు వినే శక్తిని మనం శాశ్వతంగా కోల్పోతాం.
వినికిడి లోపం తలెత్తుతోందని చెప్పే 3 ప్రధాన సంకేతాలు:
రింగింగ్ సౌండ్ :
ఇయర్‌బడ్స్ తీసేసిన తర్వాత కూడా చెవిలో నిరంతరం ఏదో ఈగ లేదా కీటకం రొద పెడుతున్నట్లు మూడు. లేదా శబ్దం రావడం.
మాటలు స్పష్టంగా వినపడకపోవడం:
ఎదుటివారు మాట్లాడుతున్న మాటలు స్పష్టంగా కాకుండా మబ్బుగా లేదా అస్పష్టంగా అనిపించడం.
టీవీ సౌండ్ పెంచడం:
ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఇతరుల కంటే ఎక్కువగా వాల్యూమ్ పెంచాల్సి రావడం.
మీ చెవులను కాపాడుకోవడానికి 60/60 రూల్ పాటించండి..
ఇయర్‌బడ్స్ వాడకాన్ని పూర్తిగా మానేయలేకపోయినా, ఈ క్రింది జాగ్రత్తల ద్వారా వినికిడి శక్తిని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు..
60/60 నియమం (60/60 Rule):
ఇయర్‌బడ్స్ వాడుతున్నప్పుడు మొబైల్ వాల్యూమ్‌ను ఎప్పుడూ 60 శాతం కంటే ఎక్కువ పెంచకూడదు. అలాగే నిరంతరాయంగా 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇయర్‌బడ్స్ పెట్టుకోకూడదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 10 నిమిషాల పాటు చెవులకు విశ్రాంతి ఇవ్వాలి.
నోయిస్ క్యాన్సిలేషన్ వాడకం:
బయట వచ్చే శబ్దాల వల్ల మొబైల్ వాల్యూమ్ పెంచే అవసరం లేకుండా, మంచి క్వాలిటీ ఉన్న యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‌బడ్స్ ఎంచుకోవడం మంచిది.
ఇయర్‌బడ్స్ షేరింగ్ వద్దు:
ఇతరుల ఇయర్‌బడ్స్ వాడటం వల్ల వారి చెవుల్లోని బ్యాక్టీరియా మన చెవుల్లోకి చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి మీ ఇయర్‌బడ్స్ ఇతరులకు ఇవ్వడం వారివి మీరు వాడటం పూర్తిగా మానేయాలి.