Bedtime Mistakes: రాత్రి పడుకునే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. ఆరోగ్యం పాడవ్వడం ఖాయం..
ఆరోగ్యం పాడవ్వడం ఖాయం..
Bedtime Mistakes: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిద్రలేమి ఒకటి. ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలితో పాటు రాత్రి వేళల్లో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే మన నిద్రను దూరం చేస్తున్నాయి. రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కరువైతే అది మరుసటి రోజు మన పనితీరుపైనే కాకుండా, దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, రాత్రి పడుకునే ముందు ఎలాంటి తప్పులు చేయకూడదో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి పూట హెవీ డిన్నర్ వద్దు..
చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా, భారీగా భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తి నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది.
బెడ్‌పైకి వెళ్లే ముందు స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా?
రాత్రి పడుకునే ముందు బెడ్‌పై వాలగానే చేతిలోకి ఫోన్ రావడం, సోషల్ మీడియా రీల్స్ లేదా వీడియోలు స్క్రోల్ చేయడం ఈ రోజుల్లో ఒక అలవాటుగా మారింది. కానీ, ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. మొబైల్స్, లాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మొన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రశాంతమైన సంగీతం వినడం లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటు చేసుకోండి.
సాయంత్రం దాటాక కెఫిన్‌కు దూరంగా ఉండండి
టీ, కాఫీ, చాక్లెట్లు, కొన్ని రకాల కూల్ డ్రింక్స్‌లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వీటిని తీసుకోవడం వల్ల నిద్ర వచ్చే ప్రక్రియ మందగిస్తుంది. అలాగే రాత్రి పూట మద్యం సేవించడం కూడా సహజమైన నిద్ర చక్రంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
రాత్రి పూట ఐస్‌క్రీమ్ తింటున్నారా? జాగ్రత్త..
చాలా మందికి డిన్నర్ పూర్తి కాగానే స్వీట్ లేదా ఐస్‌క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో ఐస్‌క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఐస్‌క్రీమ్‌లలో ఉండే అధిక కొవ్వు, చక్కెర స్థాయిలు శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇచ్చి, నిద్రను దూరం చేస్తాయి.