Bleeding While Brushing Your Teeth: ఉదయాన్నే బ్రష్ చేసుకుని సింక్‌లో ఉమ్మగానే ఎర్రటి రక్తపు చార కనిపిస్తోందా? చాలామందికిది రోజూ జరిగే అనుభవమే! "ఏదో గట్టిగా బ్రష్ తగిలి ఉంటుందిలే" అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే! ఎందుకంటే... చిగుళ్ల నుంచి రక్తం రావడం అనేది అస్సలు చిన్న సమస్య కాదు.

అసలు ఏం జరుగుతుందంటే...

మనం తిన్న ఆహార పదార్థాల రేణువులు, బ్యాక్టీరియా కలిసి పళ్లు-చిగుళ్లు కలిసే చోట ఒక అదృశ్య జిగురు పొరలా (Plaque) ఏర్పడతాయి. దీన్ని సరైన సమయంలో క్లీన్ చేయకపోతే, అది గట్టిపడి గార (Tartar) గా మారుతుంది. అప్పుడది బ్రష్ చేసినా వదలదు.

ట్విస్ట్ ఏంటంటే... మన శరీరం ఈ గారను ఒక శత్రువుగా భావిస్తుంది. దాంతో పోరాడటానికి తెల్ల రక్తకణాలను అక్కడికి పంపుతుంది. ఫలితంగా చిగుళ్లలో అంతర్గతంగా వాపు ప్రక్రియ (Inflammation) మొదలవుతుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ వల్లే చిగుళ్లు ఉబ్బి, స్వల్ప ఒత్తిడికే చిట్లిపోయి రక్తం కారుతుంది.

నిర్లక్ష్యం చేస్తే పళ్లు ఊడిపోతాయా?

దీన్ని ఆరంభంలోనే అడ్డుకోకపోతే, ఈ ఇన్‌ఫెక్షన్ దంతాల మూలాల్లోకి (Roots) దూసుకెళ్లి పళ్లను వదులుగా మార్చేస్తుంది. అంతేకాదు, మీ నోటి వాతావరణమే మారిపోతుంది. ఆక్సిజన్ లేకుండా బతికే భయంకరమైన ‘అనరోబిక్ బ్యాక్టీరియా’కు మీ నోరు నిలయంగా మారుతుంది. ఈ బ్యాక్టీరియా విడుదల చేసే సల్ఫర్ రసాయనాల వల్లే... పక్కవారితో మాట్లాడాలంటేనే భయపడేలా చేసే ‘నోటి దుర్వాసన’ మొదలవుతుంది.

ఇటీవలి వైద్య పరిశోధనల ప్రకారం... చిగుళ్ల వాపు, ఇన్‌ఫెక్షన్ కేవలం నోటికే పరిమితం కాదు. ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలవడం వల్ల గుండె జబ్బులు (Heart Diseases), డయాబెటిస్ తీవ్రమవడం, పక్షవాతం (Stroke) వచ్చే ముప్పు కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags: