Can’t Sleep at Night: రాత్రి నిద్ర రావడం లేదా? పడుకునే ముందు ఇవి పాటిస్తే చిన్నపిల్లల్లా హాయిగా నిద్రపోతారు..
చిన్నపిల్లల్లా హాయిగా నిద్రపోతారు..
Can’t Sleep at Night: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. పని ఒత్తిడి, కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు అర్ధరాత్రి వరకు మొబైల్స్ చూస్తూ గడపడం వల్ల చాలామందికి సకాలంలో నిద్ర పట్టడం లేదు. రాత్రి వేళల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు చేసే పనులపై శ్రద్ధ తగ్గడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే రాత్రి పూట కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా చిన్నపిల్లల్లా హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండండి
పడుకునే సమయానికి కనీసం 30 నుండి 60 నిమిషాల ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలు చూడటం ఆపివేయాలి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మొన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. ఫోన్ చూసే బదులు మంచి పుస్తకం చదవడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.
రాత్రి పూట తేలికపాటి ఆహారం
రాత్రి వేళల్లో ఎప్పుడూ నూనె వస్తువులు, వేపుళ్లు, భారీగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. రాత్రి 7 నుండి 8 గంటల లోపే డిన్నర్ ముగించడం మంచిది. తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగడమే కాకుండా మంచి నిద్రకు దోహదపడుతుంది.
కెఫీన్‌కు దూరంగా ఉండండి
సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చాయ్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను అస్సలు తీసుకోకూడదు. వీటిలోని కెఫీన్ కంటెంట్ నిద్ర రాకుండా చేస్తుంది. వీటికి బదులుగా రాత్రి వేళల్లో తగినంత నీరు తాగాలి. లేదా శరీరాన్ని, మనస్సును ప్రశాంత పరిచేందుకు క్యామోమైల్, లావెండర్ వంటి హెర్బల్ టీలను తాగడం మంచి అలవాటు.
పడకగది వాతావరణం ప్రశాంతంగా ఉండాలి
మనం పడుకునే బెడ్‌రూమ్ శుభ్రంగా లేకపోతే అది మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కాబట్టి పడుకునే ముందు గదిని శుభ్రంగా, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఆహ్లాదకరమైన రూమ్ వాతావరణం శరీరాన్ని రిలాక్స్ చేసి నిద్రను త్వరగా ప్రేరేపిస్తుంది.
జీవితంలో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. కాబట్టి నేటి నుంచే ఈ చిన్న చిట్కాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి, హాయిగా నిద్రపోండి..