Coffee Lovers Alert: కాఫీ లవర్స్ అలర్ట్.. రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Coffee Lovers Alert: ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగడం చాలామందికి ఒక దినచర్య. ఆఫీసు వర్క్ ఒత్తిడి తగ్గించుకోవడానికో, లేదా స్నేహితులతో కాఫీ షాప్‌లలో ముచ్చటించడానికో రోజంతా ఐదారు కప్పుల కాఫీ ఖాళీ చేసేవారు తెలుగు రాష్ట్రాల్లో తక్కువేమీ లేరు. అయితే, రోజూ పరిమితికి మించి కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కెఫీన్ సురక్షిత పరిమితి ఎంత?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు 300 నుండి 400 మిల్లీగ్రాముల కెఫీన్ మాత్రమే తీసుకోవడం సురక్షితం. అంతకుమించి తాగితే శరీరంలో కెఫీన్ మోతాదు ఎక్కువై దుష్ప్రభావాలు మొదలవుతాయి.
పరిమితి దాటితే ఎదురయ్యే ఆరోగ్య ప్రమాదాలు..
నిద్రలేమి - ఆందోళన: అధికంగా కెఫీన్ తీసుకోవడం వల్ల రాత్రివేళ సరిగ్గా నిద్రపట్టకపోవడం, కంగారు, ఆందోళన పెరగడం జరుగుతుంది.
రక్తపోటు పెరగడం:
కాఫీ తాగిన వెంటనే తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. తీవ్రమైన బిపి సమస్యలు ఉన్నవారు పరిమితికి మించి కాఫీ తాగితే గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది.
ఐరన్ లోపం:
ముఖ్యంగా గర్భిణులు, టీనేజ్ అమ్మాయిలు పరిమితికి మించి కాఫీ తాగితే ఆహారంలోని ఐరన్ శోషణ తగ్గుతుంది. దీనివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
యాసిడిటీ - జీర్ణ సమస్యలు:
ఖాళీ కడుపుతో ఎక్కువ కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
కాఫీ ప్రియులకు ఆరోగ్య నిపుణుల సలహాలు..
రోజుకు 2-3 కప్పులకే పరిమితం అవ్వండి:
ఒకే రోజులో 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది.
పరకడుపున తాగకండి:
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు ఉంటే, దానికి బదులు ఒక గ్లాస్ నీళ్లు లేదా అల్పాహారం చేసిన తర్వాత తాగడం మంచిది.
రాత్రివేళ వద్దు:
నిద్రపోయే ముందు కనీసం 6 గంటల వ్యవధిలో కాఫీ తీసుకోకుండా ఉండాలి.
ఆరోగ్య స్థితిని బట్టి జాగ్రత్త:
అధిక రక్తపోటు, అల్సర్, లేదా గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కాఫీ మోతాదును నిర్ణయించుకోవడం మంచిది.
రోజూ పరిమితి పాటిస్తే కాఫీ వల్ల ఎనర్జీ పెరగడంతో పాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. కానీ అతిగా తాగుతేనే ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని గుర్తుంచుకోండి..