Brain During Stress: ఆఫీస్‌లో పని ఒత్తిడి, పరీక్షల భయం, లేదా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి.. ఇలాంటి సమయాల్లో మనం ఒత్తిడికి గురవడం సహజం. అయితే, ఒత్తిడి అనేది కేవలం మన మనసుకు సంబంధించినది మాత్రమే కాదు, ఆ సమయంలో మన మెదడులో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇంతకీ ఒత్తిడి సమయంలో మన మెదడు లోపల నిజంగా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మన మెదడులోని ‘అమిగ్డాలా’ (Amygdala) అనే భాగం అలర్ట్ అవుతుంది. దీనిని మెదడు ‘అలారం సిస్టమ్’ అనవచ్చు. ఇది ప్రమాదాన్ని గుర్తించగానే.. వెంటనే మెదడులోని ప్రధాన కంట్రోల్ సెంటర్ అయిన ‘హైపోథాలమస్’ కు అత్యవసర సంకేతాలను పంపుతుంది.ఈ సంకేతాలు అందగానే, హైపోథాలమస్ మన శరీరంలోని నరాల ద్వారా అడ్రినల్ గ్రంథులను (Adrenal Glands) యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మన శరీరంలోకి అడ్రినలిన్ , కార్టిసాల్ (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్లు భారీగా విడుదలవుతాయి.

అడ్రినలిన్ హార్మోన్ విడుదల కావడం వల్ల మన గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు పెరుగుతుంది, శ్వాస వేగం పుంజుకుంటుంది. ఇది మన శరీరాన్ని ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ (Fight or Flight) స్థితికి సిద్ధం చేస్తుంది. అంటే ఆ సమస్యతో పోరాడటానికైనా లేదా అక్కడి నుంచి పారిపోవడానికైనా మన కండరాలకు తక్షణ శక్తిని అందిస్తుంది.

ఇక రెండో హార్మోన్ అయిన కార్టిసాల్.. మన శరీరంలోని అనవసరమైన వ్యవస్థలను తాత్కాలికంగా ఆపేస్తుంది. ఉదాహరణకు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి ఆ సమయంలో మందగిస్తాయి.ఇక్కడే అసలైన ఇబ్బంది మొదలవుతుంది. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే మెదడు ముందు భాగం.. అంటే ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తాత్కాలికంగా తన పనితీరును తగ్గిస్తుంది. అందుకే ఒత్తిడి సమయంలో మనకు ఏమీ తోచదు, సరైన నిర్ణయాలు తీసుకోలేము.

సమస్య తీరిపోగానే మెదడు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ, మనం రోజువారీ జీవితంలో నిరంతరం ఒత్తిడికి గురవుతూనే ఉంటే.. ఈ కార్టిసాల్ హార్మోన్ నిరంతరం విడుదలై మెదడు కణాలను బలహీనపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గడానికి, ఆందోళన (Anxiety) డిప్రెషన్‌కు దారితీస్తుంది.

Tags: