Excessive Hair Fall and Repeated Skin Infections: విపరీతంగా జుట్టు రాలడం, చర్మ ఇన్ఫెక్షన్లా..? అది ఆ లక్షణం కావచ్చు.. లైట్ తీసుకోవద్దు..
అది ఆ లక్షణం కావచ్చు.. లైట్ తీసుకోవద్దు..
Excessive Hair Fall and Repeated Skin Infections: ఈ రోజుల్లో డయాబెటిస్, హై బ్లడ్ షుగర్ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణంగా షుగర్ లెవెల్స్ పెరిగితే దాని ప్రభావం గుండె, మూత్రపిండాలు, కంటి చూపుపై మాత్రమే ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అధిక రక్త చక్కెర స్థాయిలు మన చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు చర్మం, జుట్టుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఏయే లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
చర్మం, జుట్టుపై హై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుంది?
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. శరీరంలో దీర్ఘకాలం పాటు రక్త చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
చర్మ సమస్యలు:
రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల చర్మ కణాలకు అందాల్సిన ముఖ్యమైన పోషకాలు, ఆక్సిజన్ అందవు. దీని ఫలితంగా చర్మం విపరీతంగా పొడిబారడం, దురద పెట్టడం, తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడటం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా చిన్న గాయమైతే అది అంత త్వరగా మానదు. కొన్ని సందర్భాల్లో చర్మం రంగు కూడా ముదురు రంగులోకి మారుతుంది.
జుట్టు రాలడం: చర్మానికి లాగే వెంట్రుకల కుదుళ్లకు కూడా సరైన పోషణ అందదు. దీంతో జుట్టు కుదుళ్లు బలహీనపడి విపరీతంగా జుట్టు రాలిపోయే సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా, కొత్త జుట్టు పెరగడం కూడా పూర్తిగా మందగిస్తుంది.
ఈ 8 లక్షణాలు కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి
మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయని చెప్పడానికి కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఇవే. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది:
తరచుగా విపరీతమైన దాహం వేయడం.
రాత్రిపూట పదేపదే మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.
డైట్, వ్యాయామం చేయకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.
రోజంతా విపరీతమైన అలసట, నీరసంగా అనిపించడం.
కంటి చూపు మసకబారడం.
చర్మంపై పదేపదే ఇన్ఫెక్షన్లు, దురదలు రావడం.
దెబ్బలు లేదా గాయాలు త్వరగా మానకపోవడం.
మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా జుట్టు రాలిపోవడం.
నివారణ మార్గాలు..
హై బ్లడ్ షుగర్ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి, చర్మం, జుట్టు సంరక్షణకు ఆరోగ్య నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.
ఆహార నియమాలు:
కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించి.. పీచు పదార్థాలు , ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
రెగ్యులర్ వ్యాయామం:
రోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరిగి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
హైడ్రేషన్ - స్కిన్ కేర్: శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలి. చర్మం పొడిబారకుండా మంచి మాయిశ్చరైజర్ వాడటం మంచిది.