Joint Pain: కీళ్ల నొప్పులా? అయితే కేవలం కాల్షియం లోపమే అనుకుంటే పొరపాటే.. అసలు కారణాలు ఇవే..
అసలు కారణాలు ఇవే..
Joint Pain: వయసుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పులు. అయితే, కీళ్ల నొప్పులు రాగానే చాలా మంది చేసే మొదటి పని.. అది శరీరంలో కాల్షియం లోపం వల్లేనని డిసైడ్ అయిపోవడం. వెంటనే సొంతంగా కాల్షియం మాత్రలు వాడటం, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మొదలుపెడతారు. కానీ, కీళ్ల నొప్పులకు కేవలం కాల్షియం లోపం మాత్రమే కారణం కాదని, దీని వెనుక శరీరంలో దాగి ఉన్న అనేక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సొంత వైద్యంతో కొత్త సమస్యలను కొనితెచ్చుకునే కంటే అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. కీళ్ల నొప్పుల వెనుక దాగి ఉండే ఆ ఇతర కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కీళ్ల నొప్పులకు దారితీసే 4 ముఖ్యమైన కారణాలు:
విటమిన్ డి3 లోపం
ఎముకల బలానికి కాల్షియం ఎంత అవసరమో, దాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్ డి3 కూడా అంతే అవసరం. శరీరంలో తగినంత విటమిన్ డి3 లేనప్పుడు, మనం ఎంత కాల్షియం ఆహారం తీసుకున్నా అది వృథా అవుతుంది. దీనివల్ల ఎముకలు క్రమంగా బలహీనపడి కీళ్ళు, కండరాలలో దీర్ఘకాలిక నొప్పులు మొదలవుతాయి.
పెరిగిన యూరిక్ యాసిడ్
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు మితిమీరినప్పుడు, అవి చిన్న చిన్న స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతాయి. దీనివల్ల అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి, వాపు వస్తాయి. ఈ సమస్య ప్రధానంగా కాలివేళ్లు, చీలమండల కీళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్
ఇది ఒక ఆటోఇమ్యూన్ సమస్య. అంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే పొరపాటున మన కీళ్లపై దాడి చేస్తుంది. దీనికి కాల్షియం లోపానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మొదట చేతి వేళ్లు, మణికట్టులోని చిన్న కీళ్లను దెబ్బతీస్తుంది. ఉదయం నిద్రలేవగానే కీళ్లలో తీవ్రమైన బిగుతు , కదల్చలేనంత నొప్పి ఉండటం దీని ప్రధాన లక్షణం.
థైరాయిడ్, హార్మోన్ల మార్పులు
హార్మోన్ల అసమతుల్యత కూడా కండరాలు, కీళ్లపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో కీళ్ల నొప్పులు సర్వసాధారణం. అలాగే, మహిళల్లో మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పడిపోవడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి.
సొంతంగా కాల్షియం మాత్రలు వాడితే ప్రమాదమే
వైద్యుని సలహా లేకుండా ఇష్టమొచ్చినట్లు ఎక్కువ కాలం కాల్షియం మాత్రలు మింగడం వల్ల శరీరంలో కాల్షియం మోతాదు అవసరానికి మించి పెరుగుతుంది. దీనివల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
మీకు కీళ్ల నొప్పులతో పాటు కింద పేర్కొన్న లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
కీళ్ల వద్ద తీవ్రమైన వాపు, ఎరుపుదనం కనిపించడం.
ఉదయం నిద్రలేచిన తర్వాత కీళ్లు బిగుసుకుపోయి, ఆ ఇబ్బంది కొన్ని గంటల పాటు కొనసాగడం.
నొప్పితో పాటు జ్వరం, తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం.