Knee Pain at Just 30: 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పులా? యువతను వేధించడానికి అసలు కారణాలు ఇవే..

యువతను వేధించడానికి అసలు కారణాలు ఇవే..

Update: 2026-05-22 08:15 GMT

Knee Pain at Just 30: ఒకప్పుడు మోకాళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోవడం, నడవలేకపోవడం వంటివి కేవలం వృద్ధాప్య లక్షణాలుగా మాత్రమే భావించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవలి కాలంలో 25 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న యువకులలో కూడా మోకాళ్ల నొప్పుల సమస్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడటానికి మారిన మన జీవనశైలి, తప్పుడు భంగిమలే ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.

శరీరంలో అత్యంత కీలకమైన కీళ్లలో మోకాలు ఒకటి. నడవడం, పరుగెత్తడం, మెట్లు ఎక్కడం వంటి ప్రతి రోజువారీ పనిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి సరైన కదలికలు లేకపోవడం, మోకాలి చుట్టుపక్కల ఉండే కండరాలు బలహీనపడటం వల్ల మోకాలి కీలుపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి నెమ్మదిగా అరిగిపోయి, చిన్న వయసులోనే నొప్పులు మొదలవుతాయి.

యువతలో మోకాలి నొప్పికి ప్రధాన కారణాలు..

గంటల తరబడి కూర్చోవడం: నేటి ఐటీ మరియు డెస్క్ ఉద్యోగాల వల్ల యువత గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండిపోతున్నారు. దీనివల్ల కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి, కీళ్ల కదలికలు మందగిస్తాయి. ఫలితంగా కుర్చీలోంచి లేచినప్పుడు కీళ్లు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి వస్తుంది.

పెరుగుతున్న శరీర బరువు: శరీర బరువు పెరగడం అనేది మోకాళ్లపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిపుణుల ప్రకారం.. మనం పెరిగే ప్రతి ఒక్క కిలో అదనపు బరువు, మోకాలి కీళ్లపై నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడిని పెంచుతుంది.

మృదులాస్థి క్షీణించడం: మోకాలి లోపలి భాగంలోని మృదులాస్థి నెమ్మదిగా అరిగిపోతున్నప్పుడు ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ కాలక్రమేణా ఇది యువకులలో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి దారితీస్తుంది.

ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు?

మీకు తరచుగా ఈ క్రింది సమస్యలు అనిపిస్తుంటే, వాటిని సాధారణ అలసటగా భావించి లైట్ తీసుకోకూడదు..

మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు మోకాళ్లలో నొప్పి రావడం.

ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువసేపు కూర్చుని లేచిన తర్వాత కాళ్లు బిగుసుకుపోవడం.

మోకాలి భాగంలో వాపు రావడం లేదా నడుస్తున్నప్పుడు కాలు పక్కకు తప్పుతున్నట్లు (అస్థిరత) అనిపించడం.

కాళ్లు మడిచినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మోకాళ్ల నుండి కటకట మనే శబ్దాలు రావడం.

వ్యాయామం లేదా రన్నింగ్ చేసిన తర్వాత కూడా చాలా సేపటి వరకు నొప్పి తగ్గకపోవడం.

మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిష్కారాలు..

చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే నిపుణులు ఈ క్రింది జాగ్రత్తలు సూచిస్తున్నారు..

యాక్టివ్‌గా ఉండండి:

ఆఫీసు పనిలో ఉన్నప్పటికీ.. ప్రతి 40 నుండి 45 నిమిషాలకు ఒకసారి సీట్లోంచి లేచి అలా అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోండి.

బరువు నియంత్రణ:

శరీర బరువు ఎల్లప్పుడూ ఎత్తుకు తగినట్లుగా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యం.

తేలికపాటి వ్యాయామాలు:

మోకాలి కండరాలను బలోపేతం చేయడానికి రోజూ నడవడం, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామాలు చేయడం చాలా మంచిది.

పోషకాహారం - నిద్ర: ఎముకల బలానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం మరియు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరం తిరిగి పునరుజ్జీవనం పొందడానికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం.

మోకాళ్ల నొప్పిని కేవలం ఒక సాధారణ నొప్పే కదా అని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లతో కాలక్షేపం చేయకూడదు. ప్రారంభ దశలోనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించి సరైన సలహాలు, ఫిజియోథెరపీ వంటివి పాటించడం ద్వారా భవిష్యత్తులో నడవలేనంత తీవ్రమైన ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు.

Tags:    

Similar News