Muscle Cramps During Summer: వేసవిలో కండరాలు పట్టేయడం: మీ శరీరం ఇస్తున్న డేంజర్ సిగ్నల్!
మీ శరీరం ఇస్తున్న డేంజర్ సిగ్నల్!
Muscle Cramps During Summer: ఎండకాలం వచ్చిందంటే చాలు.. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, చెమటలు మనల్ని ముంచెత్తుతాయి. అయితే వీటితో పాటు రాత్రిపూట నిద్ర లేకుండా చేసి, పగటి ప్రశాంతతను పాడుచేసే మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదే.. అకస్మాత్తుగా కండరాలు పట్టేయడం లేదా తిమ్మిర్లు రావడం. కండరాలు ఒక్కసారిగా గట్టిగా బిగుసుకుపోయి, తీవ్రమైన నొప్పి రావడం చాలామందిని వేధిస్తుంటుంది.
ఈ నొప్పి ముఖ్యంగా మన చేతులు, కాళ్లు, తొడలు, పిక్కల భాగంలో ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా రాత్రి హాయిగా పడుకున్నప్పుడు ఈ నొప్పి అకస్మాత్తుగా రావచ్చు. అసలు వేసవిలోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువవుతుందో తెలుసా? వైద్య నిపుణుల ప్రకారం.. శరీరంలో నీరు, ముఖ్యమైన ఖనిజ లవణాలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎండ తీవ్రతకు శరీరాన్ని చల్లబరచడం కోసం మనకు విపరీతంగా చెమట పడుతుంది. చెమట రూపంలో కేవలం నీరు మాత్రమే కాదు.. మన కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయడానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు కూడా శరీరం నుండి బయటకు పోతాయి. వీటి బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు, కండరాలు అకస్మాత్తుగా ముడుచుకుపోయి తీవ్రమైన నొప్పులు వస్తాయి.
అయితే, ఈ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎండలో పనులు చేసే కూలీలు, కార్మికులు, అథ్లెట్లు, జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్ చేసేవారు, వృద్ధులు రోజంతా తగినంత నీరు తాగని వారికి ఈ తిమ్మిర్ల ముప్పు చాలా ఎక్కువ. చాలామంది దీనిని చిన్న నొప్పే కదా అని లైట్ తీసుకుంటారు. కానీ, ఇలా కండరాలు పట్టేయడం అనేది శరీరంలో నీరు, ఖనిజాలు తీవ్రంగా తగ్గిపోయాయని చెప్పడానికి మన శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిది!
ఈ నొప్పులు ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఒక్కసారిగా వచ్చి కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు నరకం చూపిస్తాయి. కాబట్టి, ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. రోజంతా తగినంత నీరు తాగాలి. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) లీక్విడ్స్ వంటివి తీసుకుంటూ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి. అప్పుడే ఈ వేసవిలో కండరాల నొప్పులకు చెక్ పెట్టి హాయిగా నిద్రపోవచ్చు.