Restful Sleep Naturally: సహజంగా గాఢ నిద్రను ఇచ్చే సూపర్ ఫుడ్స్ ఇవే!

సూపర్ ఫుడ్స్ ఇవే!

Update: 2026-07-11 02:22 GMT

Restful Sleep Naturally: రాత్రి కాగానే మంచంపై అటు ఇటు దొర్లుతున్నారా? ఎంత ప్రయత్నించినా కంటికి నిద్ర రావడం లేదా? అయితే మీ శరీరంలో 'మెలటోనిన్' అనే హార్మోన్ లోపించిందని అర్థం. నిద్రలేమితో బాధపడే కొందరికి డాక్టర్లు మెలటోనిన్ మాత్రలను సూచిస్తుంటారు. అయితే, ఈ మాత్రలు వేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు నిద్ర వచ్చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది ముమ్మాటికీ తప్పు!

నిజానికి మెలటోనిన్ సాధారణ నిద్ర మాత్రల కన్నా పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది. ఇది మనల్ని బలవంతంగా నిద్రపోయేలా చేయదు. దీని ప్రధానమైన పని.. 'రాత్రి అయ్యింది, ఇక పడుకోవాలి' అని మెదడుకు, శరీరానికి సంకేతాలు పంపి మనల్ని నిద్రకు సన్నద్ధం చేయడమే. మన శరీరంలోని నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం (Circadian Rhythm) సక్రమంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది.

అయితే ఒక్క మాత్రల ద్వారానే మెలటోనిన్ లభిస్తుందని అనుకుంటే పొరపాటే. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఇది సహజంగానే అద్భుతంగా లభిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గింజపప్పులు (Nuts): పిస్తా, అక్రోట్లు (వాల్‌నట్స్), బాదంపప్పుల్లో మెలటోనిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మెలటోనిన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వులు, శరీరానికి కావలసిన ఖనిజాలు దండిగా లభిస్తాయి.

పప్పు దినుసులు: సోయాబీన్స్, నల్ల శనగలు, కాబూలీ శనగల వంటి పప్పు ధాన్యాల్లో కూడా మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది.

పాలు: ఆహారం ద్వారా మెలటోనిన్ పొందాలనుకునే వారికి రాత్రి పూట తాగే గోరువెచ్చని పాలు ఒక అద్భుతమైన ఆప్షన్.

మాంసాహారం , గుడ్లు: నాన్-వెజ్ ప్రియులకు గుడ్లలో మెలటోనిన్ అత్యధికంగా లభిస్తుంది. వీటితో పాటు శరీరానికి ప్రోటీన్, ఐరన్ అందుతాయి. అలాగే సాల్మన్ వంటి చేపలను తీసుకోవడం ద్వారా కూడా మెలటోనిన్ లభిస్తుంది.

పుట్టగొడుగులు (Mushrooms): శాఖాహారులకు కొన్ని రకాల పుట్టగొడుగులు కూడా మెలటోనిన్‌ను అందించడంలో అద్భుతంగా సహాయపడతాయి.

కేవలం మాత్రలపైనే ఆధారపడకుండా, ఈ సహజ ఆహారాలను మీ డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.. రాత్రి పడుకోవడానికి గంట ముందే మొబైల్స్, ల్యాప్‌టాప్స్ పక్కన పెట్టేయాలి. లేదంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.

Tags:    

Similar News