Unable to Sleep Properly at Night: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో నిద్రలేమి ఒకటి. రాత్రి ఎంతసేపైనా నిద్ర పట్టకపోవడం, పడకపై అటు ఇటు దొర్లడం, ఒకవేళ నిద్ర పట్టినా అర్ధరాత్రి పదేపదే మెలకువ రావడం, ఉదయం లేచినా శరీరం అలసటగా అనిపించడం వంటివి ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయాయి. చాలా మంది దీనికి మానసిక ఒత్తిడి లేదా బిజీ లైఫ్‌స్టైల్ మాత్రమే కారణం అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్లు, పోషకాల లోపం వల్ల కూడా నిద్ర నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన శరీరంలో ఏయే పోషకాల లోపం వల్ల నిద్రకు భంగం కలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నిద్రను శాసించే ఆ 4 ముఖ్యమైన పోషకాలు ఇవే..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ డి, విటమిన్ బి12, మెగ్నీషియం, ఐరన్ (ఇనుము) మన శరీరంలోని నిద్ర సంబంధిత ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి లోపం ఏర్పడితే నిద్రలేమితో పాటు తీవ్ర అలసట, మానసిక రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.

విటమిన్ డి

సాధారణంగా సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి కేవలం ఎముకలకే కాదు, ప్రశాంతమైన నిద్రకు కూడా చాలా అవసరం. శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడితే మనం నిద్రపోయే సమయం తగ్గిపోతుంది. దీనివల్ల ఎంత పడుకున్నా నిద్ర చాలినట్లు అనిపించదు, రోజంతా విపరీతమైన అలసట వేధిస్తుంది.

విటమిన్ బి12

మన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ బి12 ఎంతో కీలకం. ఈ విటమిన్ గనుక శరీరంలో తగ్గితే నరాలు బలహీనపడతాయి. దీని ప్రభావం నిద్రపై పడి.. రాత్రిపూట గాఢ నిద్ర పట్టకపోవడం, పదేపదే మెలకువ వచ్చి నిద్రకు భంగం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

మెగ్నీషియం

మెగ్నీషియం శరీరానికి ఒక సహజ సిద్ధమైన రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. ఇది మెదడును, కండరాలను ప్రశాంతపరచడానికి సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఆందోళన పెరగడం, రాత్రిపూట కండరాల నొప్పులు రావడం మరియు తీవ్రమైన నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

ఐరన్, ఇనుము

శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడి, కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీనివల్ల కాళ్లలో ఒక రకమైన చంచలత్వం, విపరీతమైన అలసట కలిగి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం కష్టంగా మారుతుంది.

నివారణకు ఏం చేయాలి?

సమతుల్య ఆహారం:

నిత్యం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

ఎండలో గడపడం:

విటమిన్ డి కోసం ఉదయం పూట కాసేపు లేత ఎండలో నడవడం అలవాటు చేసుకోవాలి.

వైద్య పరీక్షలు:

నిద్రలేమి సమస్య చాలా కాలంగా వేధిస్తుంటే, సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ సలహా మేరకు బ్లడ్ టెస్ట్ చేయించుకుని, లోపాలు ఉన్న విటమిన్లకు తగిన సప్లిమెంట్లు వాడటం మంచిది.

Tags: