Brain to Stay Active and Sharp: మెదడు చురుగ్గా, పదునుగా ఉండాలా? రోజూ ఈ చిన్న పనులు చేస్తే చాలు.. సైంటిస్టుల గుడ్ న్యూస్..
సైంటిస్టుల గుడ్ న్యూస్..
Brain to Stay Active and Sharp: శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం జిమ్‌కు వెళ్లడం, వాకింగ్ చేయడం వంటి వ్యాయామాలు చేస్తుంటాం. అయితే శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో.. మన మెదడుకు కూడా నిరంతర సవాళ్లు, కొత్త అనుభవాలు అంతే అవసరమని నాడీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే రకమైన దినచర్యకు పరిమితమైపోతే ఆలోచనా నైపుణ్యాలు మొద్దుబారిపోయే ప్రమాదం ఉందని, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే మెదడును నిత్య నూతనంగా ఉంచుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.
మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఆ ఐదు అద్భుతమైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుస్తక పఠనం.. ఇతరులతో చర్చ..
పుస్తకాలు చదవడం అనేది కేవలం ఒక కాలక్షేపం మాత్రమే కాదు, అది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఊహాశక్తిని అద్భుతంగా పెంపొందించే ఒక టానిక్ లాంటిది. కేవలం చదవడమే కాకుండా మీరు చదివిన విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల మెదడుకు అదనపు ఆలోచనా ప్రేరణ లభిస్తుంది. ఇది కొత్త దృక్కోణాలను అలవర్చడమే కాకుండా, మానసిక ఒత్తిడిని కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
సంగీతం, నృత్యం.. బ్రెయిన్‌కు రీఛార్జ్..
ఏదైనా ఒక కొత్త సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్చుకోవడం లేదా నృత్యం సాధన చేయడం వల్ల శరీరం, మెదడు ఒకే సమయంలో ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా సంగీత శిక్షణ వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మరియు భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. అలాగే, ఒక కొత్త భాషను నేర్చుకోవడం వల్ల మెదడులో సరికొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇండోర్ గేమ్స్‌తో ఆలోచనా శక్తికి పదును:
కేవలం వినోదం కోసమే కాకుండా, మైండ్ గేమ్‌లను మెదడుకు మేతగా మార్చుకోవచ్చు.
చదరంగం, సుడోకు, ఫజిల్స్:
ఇవి సమస్య పరిష్కార నైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను మరియు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.
రోజువారీ జీవితంలో వచ్చే పరధ్యానాన్ని తగ్గించి, ఫోకస్‌ను పెంచడానికి రోజుకు కొద్ది సమయం ఈ ఆటలకు కేటాయించడం మంచిది.
ప్రకృతితో స్నేహం.. సామాజిక బంధాలు:
ఎల్లప్పుడూ నాలుగు గోడల మధ్యే ఉండిపోకుండా, ప్రకృతి ఒడిలో కాసేపు సమయం గడపడం వల్ల మనశ్శాంతి, ఆలోచనలలో స్పష్టత వస్తాయి. ఈవినింగ్ వాక్ లేదా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా నలుగురితో మాట్లాడటం మరియు సామాజిక సంబంధాలను కొనసాగించడం వల్ల ఒంటరితనం దూరమై, మానసిక స్థైర్యం పెరుగుతుంది.
మెదడు ఆరోగ్యం వెనుక ఉన్న అసలు రహస్యం:
మీ మెదడును ఎల్లప్పుడూ యంగ్‌గా ఉంచే ఏకైక సీక్రెట్ "నిరంతరం కొత్త విషయాలను ప్రయత్నిస్తూ ఉండటమే". కొంచెం సవాలుగా అనిపించే పనులను మెదడుకు అప్పగించినప్పుడు, అది మరింత బలంగా, చురుగ్గా మారుతుంది.
కాబట్టి వయస్సుతో అస్సలు సంబంధం లేదు.. మీ మెదడుకు పదును పెట్టే సరికొత్త హాబీలను ఇవాళే ప్రారంభించండి..