Best Time to Drink Coffee: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్ ఏది? రాత్రిపూట కాఫీ తాగితే ఏమవుతుంది?
రాత్రిపూట కాఫీ తాగితే ఏమవుతుంది?
Best Time to Drink Coffee: చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి కాఫీ పడాల్సిందే. కొందరైతే రాత్రి పడుకునే ముందే... ఉదయాన్నే కాఫీ రెడీగా ఉండేలా టైమర్ కూడా సెట్ చేసుకుంటారు. ఉదయాన్నే కాఫీ తాగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే, అసలు నిద్రలేచిన వెంటనే కాఫీ తాగడం మంచిదేనా..? దీనిపై సైన్స్ ఏం చెబుతోంది? కాఫీ తాగడానికి కచ్చితమైన బెస్ట్ టైమ్ అంటూ ఏమీ లేదని కొందరు అంటుంటే... ఉదయం కొంచెం సమయం గడిచాక లేదా మధ్యాహ్నం తాగడం మంచిదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.
అసలు రాత్రిపూట కాఫీ తాగడం మంచిదేనా? నైట్ షిఫ్ట్ చేసేవారు తప్ప, మిగిలిన వారు రాత్రి వేళల్లో కాఫీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే, మనం తాగిన కాఫీలోని సగం కెఫీన్‌ను మన శరీరం బయటకు పంపడానికి కనీసం 2 నుండి 10 గంటల సమయం పడుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు.
అయితే, కొంతమందికి రాత్రి 10 గంటలకు స్ట్రాంగ్ కాఫీ తాగినా వెంటనే హాయిగా నిద్ర పడుతుంది. దీనికి కారణం వారిలో ఉండే CYP1A2 అనే 'కాఫీ జన్యువు. ఈ జన్యువు బలంగా ఉన్నవారి శరీరం, కెఫీన్‌ను చాలా వేగంగా జీర్ణం చేసి బయటకు పంపేస్తుంది.
మరి కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్ ఏది?
శాస్త్రీయంగా చూస్తే... ఉదయం 9:30 నుండి 11 గంటల మధ్య కాఫీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో సహజంగా ఉండే 'కార్టిసాల్' అనే హార్మోన్ స్థాయిలు తగ్గడం మొదలవుతాయి. కాబట్టి ఈ టైమ్‌లో కాఫీ తాగితే, అందులోని కెఫీన్ వల్ల మనకు మంచి శక్తి, రోజంతా ఉత్సాహం లభిస్తాయి.
అలాగే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాలా మందికి భోజనం చేశాక నీరసంగా లేదా బద్ధకంగా అనిపిస్తుంది. ఒక చిన్న కునుకు తీసే అవకాశం లేనప్పుడు, ఒక కప్పు కాఫీ తాగితే మిగిలిన రోజంతా చురుకుగా పని చేసుకోవచ్చు.
అయితే రోజుకు ఎంత కాఫీ తాగవచ్చు?
అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ (FDA) నిబంధనల ప్రకారం సాధారణ పెద్దలు రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు అయితే 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ తీసుకోవాలి. గుర్తుంచుకోండి... మనం తాగే కాఫీలోనే కాకుండా చాక్లెట్లు, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కూడా కెఫీన్ ఉంటుంది. వీటన్నింటినీ కలిపి లెక్క వేసుకోవాలి. సాధారణంగా మనదేశంలో ప్రజలు రోజుకు సగటున 135 మిల్లీగ్రాముల కెఫీన్ అంటే దాదాపు ఒకటిన్నర కప్పుల కాఫీ మాత్రమే తీసుకుంటారు.