Trump Expresses Confidence: సుంకాలతో అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం త్వరలో: ట్రంప్ ధీమా
600 బిలియన్ డాలర్ల ఆదాయం త్వరలో: ట్రంప్ ధీమా
Trump Expresses Confidence: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల (టారిఫ్స్) విధానాన్ని మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై విధించిన సుంకాల ద్వారా ఇప్పటికే భారీ ఆదాయం సమకూరిందని, త్వరలోనే మరో 600 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.54 లక్షల కోట్లు) వస్తాయని ప్రకటించారు. ఈ విధానం దేశాన్ని ఆర్థికంగా, జాతీయ భద్రతాపరంగా ఎప్పుడూ లేనంత బలోపేతం చేసిందని, ప్రపంచంలో అమెరికాకు గౌరవం పెరిగిందని ఆయన అన్నారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేసిన ట్రంప్... ‘‘సుంకాల ద్వారా మేం ఇప్పటికే భారీ మొత్తంలో నిధులు వసూలు చేశాం. త్వరలోనే 600 బిలియన్ డాలర్లకు పైగా వచ్చేస్తాయి. కానీ కొన్ని మీడియా సంస్థలు దేశాన్ని ద్వేషించి, ఈ విషయాన్ని కవర్ చేయడానికి నిరాకరిస్తున్నాయి’’ అని ఆరోపించారు. అమెరికా సుప్రీంకోర్టులో సుంకాల అధికారంపై కీలక కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
2025 జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ శత్రు-మిత్ర భేదం లేకుండా పలు దేశాలపై భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నెపంతో భారత్‌పై 50 శాతం సుంకాలు వేసిన అమెరికా... ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు అడ్డంకిగా మారింది. అయినప్పటికీ భారత్ ఈ సుంకాలపై గట్టి వైఖరి అనుసరిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా సిద్ధంగా ఉన్నామని వైట్‌హౌస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ‘‘ప్లాన్-బి సిద్ధంగా ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా లేకపోవడం అజాగ్రత్తే. సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ గతంలో చెప్పారు.
సుంకాల విధానంతో అమెరికా ఆర్థిక బలం పెరిగిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన ప్రపంచ వాణిజ్యంపై మరిన్ని చర్చలకు దారితీయనుంది.