Anti-India Protests in Bangladesh: బంగ్లాదేశ్‌లో భారత్ వ్యతిరేక నిరసనలు: చట్టోగ్రామ్‌లో అసిస్టెంట్ హైకమిషన్ ముట్టడి
చట్టోగ్రామ్‌లో అసిస్టెంట్ హైకమిషన్ ముట్టడి
Anti-India Protests in Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన వార్తతో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చట్టోగ్రామ్ (చిట్టగాంగ్)లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకారులు రాత్రి 11 గంటల ప్రాంతంలో గుమిగూడి ధర్నా చేపట్టారు. భారత్‌కు, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
హైది మరణ వార్త వెలువడిన వెంటనే ఢాకా సహా పలు నగరాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. ఢాకాలోని కవ్రాన్ బజార్ ప్రాంతంలో డెయిలీ స్టార్, ప్రోథమ్ అలో వంటి ప్రముఖ పత్రికల కార్యాలయాలపై అల్లరి మూకలు దాడులు చేశాయి. నిప్పంటించి విధ్వంసం సృష్టించాయి. దాదాపు 25 మంది జర్నలిస్టులు, వీరిలో మహిళలు కూడా ఉన్నారు, అగ్నికీలల్లో చిక్కుకున్నారు. గంటల తరబడి శ్రమించి వారిని సురక్షితంగా రక్షించారు. న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలతో ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా సస్పెండ్ చేశాయి.
అదనంగా, బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబానికి చెందిన ధన్‌మోండీ 32 ప్రాంతంలోని ఇంటిని (ప్రస్తుతం మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు) నిరసనకారులు ధ్వంసం చేశారు. గత జులైలో అవామీలీగ్ నేత, మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హైది కీలక పాత్ర పోషించాడు. ఇటీవల భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన అతనిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశంలో శాంతి నెలకొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.