Britain: లండన్ స్కూల్‌లో తిలకం కారణంగా.. 8 ఏళ్ల హిందూ బాలుడిపై వివక్ష: స్కూల్ మారాల్సిన పరిస్థితి
8 ఏళ్ల హిందూ బాలుడిపై వివక్ష: స్కూల్ మారాల్సిన పరిస్థితి
Britain: బ్రిటన్ రాజధాని లండన్‌లోని ఒక పాఠశాలలో 8 ఏళ్ల హిందూ విద్యార్థికి తీవ్రమైన వివక్ష ఎదురైంది. తన మత సంప్రదాయాలకు అనుగుణంగా తిలకం ధరించి స్కూలుకు వెళ్లినందుకు పాఠశాల యాజమాన్యం ప్రతికూలంగా స్పందించడంతో ఆ చిన్నారి ఇతర స్కూలుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్‌సైట్ యూకే అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, లండన్‌లోని ఆ పాఠశాలలో చదువుతున్న ఈ ఎనిమిదేళ్ల బాలుడు తన హిందూ సంప్రదాయాల ప్రకారం తిలకం పెట్టుకుని తరగతికి హాజరవుతున్నాడు. అయితే, స్కూలు యాజమాన్యం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పాఠశాల సిబ్బంది ఆ బాలుడి మతపరమైన ఆచారాల గురించి పదేపదే ప్రశ్నలు అడిగేవారు. బ్రేక్ సమయంలో పిల్లలు ఆడుకునేటప్పుడు హెడ్‌టీచర్ ప్రత్యేకంగా ఆ విద్యార్థిపై దృష్టి సారించేవారని తెలిసింది.
దీంతో భయపడిన ఆ బాలుడు ఇతర పిల్లలతో ఆడుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఒంటరితనాన్ని ఎదుర్కొన్నాడని ఇన్‌సైట్ యూకే సంస్థ ఆరోపించింది. ఏ విద్యార్థి కూడా తన మత విశ్వాసాల కారణంగా ఇలాంటి మానసిక ఒత్తిడికి గురికాకూడదని, ఇది విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుందని సంస్థ విమర్శించింది.
బాలుడి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి తమ మత ఆచారాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఆ చిన్నారిని మరో పాఠశాలకు మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి వివక్షాపూరిత చర్యల వల్ల గతంలో కూడా కొందరు విద్యార్థులు ఈ స్కూలు వదిలి వెళ్లిపోయినట్లు ఆగ్రహం వ్యక్తమైంది.
బ్రిటన్ చట్టాల ప్రకారం ఇలాంటి ఘటనలు మత వివక్షగా పరిగణించబడతాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందువులు, భారతీయ సమాజం ఈ విషయంలో బలమైన స్పందన వ్యక్తం చేస్తోంది.