G7 Nations: భారత్, చైనాపై టారిఫ్‌లు విధించేందుకు జీ7 దేశాల అంగీకారం.. రష్యాపై ఒత్తిడి
జీ7 దేశాల అంగీకారం.. రష్యాపై ఒత్తిడి
G7 Nations: ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు రష్యాపై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కీలక ప్రతిపాదనలు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై టారిఫ్‌లు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ ప్రతిపాదనపై జీ7 దేశాలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం జీ7 దేశాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. "ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కట్టుబడి ఉంటే, రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా భారత్, చైనాలపై సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించింది. జీ7 దేశాలు ఈ యుద్ధాన్ని ముగించేందుకు కట్టుబడి ఉన్నాయని హామీ ఇచ్చాయి. ఈ క్లిష్ట సమయంలో అమెరికాతో కలిసి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నాం" అని జామిసన్ గ్రీర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో భారత్, చైనాలపై సుంకాల విధానంలో జీ7 దేశాలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. గతంలో ట్రంప్ ఇదే ప్రతిపాదనను ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల ముందు ఉంచగా, భిన్నాభిప్రాయాల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు జీ7 దేశాలతో ఈ ప్రతిపాదనను మళ్లీ ముందుకు తెచ్చారు.