Usman Hadi Murder Case Accused Still in Dubai: హాదీ హత్య కేసు నిందితుడు దుబాయ్‌లోనే.. సంచలన వీడియో విడుదల!
సంచలన వీడియో విడుదల!
Usman Hadi Murder Case Accused Still in Dubai: బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు హాదీ హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడిగా గుర్తించిన ఫైసల్ కరీమ్ మసూద్ తాజాగా దుబాయ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతూ అతడు ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియోతో కేసు మరింత కుట్రల జటిలతల్లోకి జొచ్చుకుంది.
వీడియోలో ఫైసల్ మాట్లాడుతూ... తనను కావాలనే ఈ హత్య కేసులో ఇరికించారని ఆరోపించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కోసం దుబాయ్‌కు వచ్చానని తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన కొందరు ఈ హత్యలో పాలుపంచుకున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. హాదీతో తనకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని, ప్రభుత్వ కాంట్రాక్టులు సంపాదించేందుకు హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను డబ్బు సాయం చేశానని వివరించాడు.
గత డిసెంబరు 12న హాదీపై జరిగిన దాడి తర్వాత ఫైసల్‌తో పాటు మరో నిందితుడు ఆలంగీర్ షేక్ దేశం విడిచి పారిపోయారని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఇటీవల వీరు భారత్‌లో ఉన్నారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ప్రకటించగా... భారత భద్రతా దళాలు దీన్ని తోసిపుచ్చాయి. సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి ప్రవేశించలేదని బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. పొరుగు దేశం నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత అధికారులు మండిపడ్డారు.
ఇక ఢాకా పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. హత్యకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్టు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిందితులకు పారిపోవడానికి సహకరించిన ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. ఫైసల్ వీడియో విడుదలతో కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.