Hindu Worker Run Over and Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడిని కారుతో ఢీ కొట్టి హత్య: ఇంధన బిల్లు అడిగినందుకే ఘాతుకం
ఇంధన బిల్లు అడిగినందుకే ఘాతుకం
Hindu Worker Run Over and Killed in Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందూ కార్మికుడిని స్థానికుడు కారుతో ఢీకొని హత్య చేశాడు. ఈ ఘటన శుక్రవారం రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడు ఆ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ తన కారుకు పెట్రోల్ కొట్టించుకున్నాడు. అయితే, డబ్బు చెల్లించకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన రిపోన్ అతడిని ఆపి, ఇంధనానికి అయిన మొత్తం చెల్లించాలని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన హషేమ్ కారును రిపోన్ పైకి దూసుకువెళ్లాడు. కారు తనపై నుంచి వెళ్లడంతో రిపోన్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుల్ హషేమ్‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలి మూడు వారాల్లోనే బంగ్లాదేశ్‌లో పది మంది హిందువులు హత్యకు గురికావడంతో అక్కడి మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలు దేశంలో మతపరమైన హింసను మరింత తీవ్రతరం చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.