Trump: ఆ యుద్ధాన్ని ఆపడం సులభమని భావించాను : ట్రంప్‌

సులభమని భావించాను : ట్రంప్‌

Update: 2025-09-06 11:19 GMT

Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ‘ఒక్క రోజులో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగిస్తాను’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పారు. అయితే, ఆ హామీని నెరవేర్చలేకపోతున్నానని ట్రంప్‌ తాజాగా అంగీకరించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడం సులువని భావించానని, కానీ ఇది తన హయాంలో ఎదురైన అత్యంత క్లిష్టమైన ఘర్షణ అని వెల్లడించారు.

వైట్‌హౌస్‌లో అమెరికా కాంగ్రెస్‌ సభ్యులకు ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. గత ఏడు నెలల్లో ఏడు సుదీర్ఘ యుద్ధాలను ఆపినట్లు చెప్పుకొచ్చారు. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయానని తెలిపారు. ‘‘31 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ఘర్షణను రెండు గంటల్లో ముగించాను. 35-37 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపాను. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో నాకున్న స్నేహబంధం కారణంగా ఈ యుద్ధాన్ని ముగించడం సులువని అనుకున్నాను. కానీ, ఇది అంత సులభం కాదని తేలింది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణను ఆపడం అత్యంత కష్టమైన పనిగా మారింది’’ అని ట్రంప్‌ వివరించారు.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్‌ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అలాస్కాలో పుతిన్‌తో భేటీ అయినప్పటికీ, కాల్పుల విరమణకు అధికారిక ఒప్పందం ఇంకా కుదరలేదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News